పీపీపీ అంటే ప్రైవేటీకరణే కానీ.. ! బాలయ్య షాకింగ్..!
ఏపీలో 10 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. ఇది వైద్యాన్ని ప్రైవేటీకరించే కుట్ర అంటూ ఓవైపు విపక్షాలు మండిపడుతుంటే.. మరోవైపు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు పీపీపీ విధానం ఎంచుకుంటే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో దీనిపై ప్రజా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మెడికల్ కాలేజీల నిర్మాణానికి చంద్రబాబు ఎంచుకున్న పీపీపీ విధానంపై బాలకృష్ణ ఇవాళ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
పీపీపీ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అని అర్థం అని తేల్చేశారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే మానిటరింగ్ చేస్తోందని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు ఖర్చు చేసింది రూ.212 కోట్లు మాత్రమేనన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అని బాలయ్య తెలిపారు. అంటే పనులు ప్రైవేటుకు అప్పగించినా వారిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రైవేటు వారికి ఓ బాధ్యత, భయం ఉంటుందన్నారు. క్వాలిటీ ఉంటుందని, ఓ కమిటీ ఉంటుందని బాలయ్య తెలిపారు. ప్రైవేటు వారికి ఇచ్చినా వారిపై పర్యవేక్షణ ఉన్నప్పుడు ఇబ్బందేముందని బాలకృష్ణ ప్రశ్నించారు.

వైసీపీ నేతలకు మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆరాటం మాత్రమే ఉందన్నారు. చేసిందేమీ లేదు కానీ మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉబలాటం తప్ప, వ్యర్ధ ప్రసంగాలు తప్ప ఏమీ లేదన్నారు. ఇవి కేవలం ప్రసంగాలు మాత్రమే తప్ప లోపల ఎలాంటి చిత్తశుద్ధి లేదంటూ వైసీపీ నేతలపై బాలయ్య విమర్శలు ఎక్కుపెట్టారు. మెడికల్ కాలేజీలపై వైసీపీది కేవలం ప్రచార ఆర్భాటమేనని బాలయ్య తేల్చేశారు.












Click it and Unblock the Notifications