లోకేష్ గేమ్ ఛేంజర్-ప్రధాని ఎందుకు కాకూడదు ? గంటా కొడుకు షాకింగ్..!
ఏపీలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారాన్ని తెరపైకి తెచ్చి కొన్ని రోజుల పాటు రచ్చ రచ్చ చేసిన టీడీపీ నేతలు తాజాగా అధిష్టానం ఆదేశాలతో శాంతించారు. అలా కనిపిస్తున్నారు కానీ శాంతించలేదు. ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ ప్రధాని ఎందుకు కాకూడదంటూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కుమారుడు ఒకరు ప్రశ్నిస్తున్నారు. దీంతో టీడీపీతో పాటు అన్ని పార్టీల్లోనూ కలకలం రేగుతోంది. ఈ డిమాండ్లు ఇంకా ఏ స్ధాయికి వెళ్తాయన్నదే ఆ చర్చ సారాంశం.
టీడీపీలో గతంలో మంత్రిగా పనిచేసి,ఇప్పుడు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ అన్నయ్య ప్రధాని ఎందుకు అవ్వకూడదని ఆయన ప్రశ్నించారు. నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్పూర్తి అన్నారు. ఏపీ లో లోకేష్ గేమ్ ఛేంజర్ అవుతారని అనుకోలేదని రవితేజ తెలిపారు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరం అంటూ వ్యాఖ్యానించారు. అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు కానీ అన్నయ్య (నారా లోకేష్ ) ప్రధాన మంత్రి కావాలంటూ రవితేజ వెల్లడించారు.ఏదో ఒకరోజు లోకేష్ ను ప్రధాన మంత్రిగా చూడాలని తన కోరిక అన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లను టీడీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ జనసేన కౌంటర్ ఇస్తోంది. అదే సమయంలో దావోస్ టూర్ లోనే ఏకంగా మంత్రి టీజీ భరత్ లోకేష్ భవిష్యత్ సీఎం అంటూ కామెంట్ చేసి చంద్రబాబుతో తిట్లు తిన్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాస్ కుమారుడు.. లోకేష్ ఏకంగా ప్రధాని కావాలంటూ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వంగా చేశారా లేక ప్రచారం కోసం చేశారా అన్నది అర్దం కావడం లేదని టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా లోకేష్ కేంద్రంగా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవాలన్న టీడీపీ నేతల ఆరాటం మాత్రం ఏదో విధంగా బయటపడుతూనే ఉంది.












Click it and Unblock the Notifications