పవన్ అభిమానుల కుటుంబానికి టిడిపి ఎమ్మెల్యే పరామర్శ:గురువారం పవన్ రాక
విశాఖపట్టణం:పవన్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో మృత్యువాతన పడిన అభిమాని కుటుంబాన్ని టీడీపీ ఎమ్మెల్యే అనిత పరామర్శించారు. పవన్ కు స్వాగతం పలుకుతూ పాయకరావుపేటలో ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ కు గురై నాగరాజు, భీమవరపు శివ అక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే.

మృతి చెందిన ఇద్దరు అభిమానుల్లో శివది పాయకరావు పేట కాగా నాగరాజు స్వస్థలం తుని. ఈ నేపథ్యంలో అభిమానుల మృతి తనను కలచి వేసిందని, వారి కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని పవన్ కళ్యాణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ క్రమంలో పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత పవన్ అభిమాని శివ కుటుంబాన్ని పరామర్శించారు.

ప్రస్తుతం విశాఖ జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం పాయకరావుపేటలో పర్యటించనున్నారు. పవన్ పర్యటన నేపధ్యంలో ఆయన అభిమానులైన టి.నాగరాజు, భీమవరపు శివ అనే ఇద్దరు యువకులు మంగళవారం అర్ధరాత్రి దాటాక పాయకరావుపేట ప్రధాన రహదారి పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా 33కేవీ విద్యుత్ తీగలకు ఫ్లెక్సీ ఇనుప రాడ్స్ తగిలడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే.
అభిమానుల మరణం విషయం తెలిసి పవన్ కళ్యాణ్ తాను స్వయంగా వచ్చి అభిమానుల కుటుంబాలను పరామర్శించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. జనసేన కార్యకర్తల మరణం తనను కలచివేసిందని, ఇది చాలా బాధాకరమని...వారి మరణం కుటుంబాలకు ఎంత వేదన కలిగిస్తుందో అర్థం చేసుకోగలనని పవన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ కుటుంబాలని స్వయంగా పరామర్శించడంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటామని పవన్ ఆ ప్రకటనలో తెలిపారు. పవన్ కళ్యాణ్ గురువారం పాయకరావు పేటలో పర్యటించనుండటంతో ముందుగా శివ కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిసింది.
మరోవైపు పవన్ అభిమానుల మృత్యువాత విషయం తెలిసి పాయకరావు ఎమ్మెల్యే అనిత స్థానికుడైన శివ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి చంద్రన్న భీమాను పంపిణీ చేయడంతో పాటు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత తెలిపినట్లు సమాచారం.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!