ఏది నిజం?: సంప్రదించారని పయ్యావుల, ఖండించిన వైసీపీ ఎమ్మెల్యేలు
అమరావతి: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకాశ్ గౌడ్‌లు బుధవారం సాయంత్రం అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. దీంతో తెలంగాణలో టీడీపీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఆ వార్తతో పాటే గురువారం ఉదయం వైసీపీకీ చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఏపీలోని ఆధికార పార్టీ టీడీపీలో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సిద్ధపడ్డారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. దానికి బలం చేకూరుస్తున్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఆ తర్వాత పరిస్థితి తారుమారైంది.
Cartoon: TTDP leaders join TRS
వైసీపీ ఎమ్మెల్యేలు ఈ వార్తలను ఖండించారు. అసలు ఈ వార్తల్లో నిజమెంత? కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ చేరేందుకు తమతో చర్చించిన విషయం వాస్తమేనని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర పునర్‌నిర్మాణంలో భాగస్వాములవుతామంటే ఎవరికైనా స్వాగతం పలుకుతామన్నారు.

వైసీపీ అధినేత వైయస్ జగన్ వైఖరిని సొంత ఎమ్మెల్యేలే భరించలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అభివృద్ధిని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారని అన్నారు. గురువారం ఆయన వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, విపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి వైపు చూస్తున్నారని దేవినేని అన్నారు. అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వైసిపి ఎమ్మెల్యేలు సముఖత చూపుతున్నారన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికోసం ఎమ్మెల్యేలు చంద్రబాబును కలస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అభివృద్ధి పనుల కోసమే తాను చంద్రబాబును కలిశానని చెప్పారు.
అంతమాత్రాన పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. చివరి వరకు తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. జగన్ ఆశీస్సులు ఉన్నంత వరకు పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ, కృష్ణా, ప్రకాశం, కడప, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు ఆరు నుంచి తొమ్మిది మంది వరకు టిడిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి.
కృష్ణా జిల్లా నుంచి ఉప్పులేటి కల్పన, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్, ప్రకాశం జిల్లా నుంచి సురేష్, పోతుల రామారావు, కడప నుంచి ఆదినారాయణ రెడ్డి, విశాఖ నుంచి సర్వేశ్వర రావు, ఎస్పీఎస్ నెల్లూరు నుంచి సునీల్, సంజీవ్ పేర్లు వినిపించాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎమ్మెల్యేల నుంచి స్పష్టత కోరారు.

దీంతో నూజివీడు ఎమ్మెల్యే మేకా అప్పారావు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు తాము సైకిల్ ఎక్కుతామన్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తాము తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం లేదన్నారు. అదేవిధంగా తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ప్రకాశం జిల్లా వెైసీపీ ఎమ్మెల్యేలు అధ్యక్షుడు జగన్‌కు స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరులో గురువారం వైయస్ జగన్ పర్యటించారు. దీంతో అధినేత వైయస్ జగన్‌ను కలిసిన వైసీపీ నేతలు మీడియాలో వచ్చిన వార్తలపై స్పష్టత నిచ్చారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని, తాము వైసీపీలోనే కొనసాగుతామని జగన్‌కు తెలిపారు.
ఇలా ఉన్నట్టుండి వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తెలుగుదేశంలోకి చేరనున్నట్లు వార్తలు రావడం వెనుక ఎల్లో మీడియా హస్తం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుండటంతో ఆ విషయంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని ముందే ఊహించిన ఎల్లో మీడియా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications