ప్రధాని మోడీ నివాసం ఎదుట టీడీపీ ఎంపీల ధర్నా, హల్‌చల్, అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు హల్‌చల్ చేశారు. ఆదివారం ఉదయం వారు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎంపీలు భద్రతా వలయాన్ని దాటుకొని ప్రధాని నివాసంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో ప్రధాని నివాసం బయట ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినా వారు తగ్గలేదు. జేసీ దివాకర్ రెడ్డి, గల్లా జయదేవ్ తదితర ఎంపీలు నిరసనకు దిగారు.

పోలీసులు తనను పట్టుకోవడంతో జేసీ దివాకర్ రెడ్డి ఆయనను దులిపేసుకొని అటు నుంచి ముందుకు కదిలారు. ఎంపీలు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. మాగంటి బాబు తిరుమల శ్రీవారి ఫోటోను పట్టుకొని ప్రధాని నివాసం ఎదుట రోడ్డుపై పడుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.

ఢిల్లీలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశం
ఇదిలా ఉండగా, టిడిపి ఎంపీలు శనివారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వారు విమానాశ్రయానికి కూడా బయలుదేరారు. కానీ చంద్రబాబు ఫోన్ చేసి మరో రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించారు. దీంతో వారు తిరిగి వెళ్లారు.












Click it and Unblock the Notifications