Nellore Politics:ఆనం, కోటంరెడ్డి ఎఫెక్ట్ - టీడీపీ వ్యూహం బెడిసి కొడుతోందా..!!
నెల్లూరు జిల్లా వైసీపీ కంచుకోట. అక్కడ ఈ సారి వైసీపీని దెబ్బ తీయాలనేది టీడీపీ వ్యూహం. ఇప్పటికే వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారని ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీసీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర వేళ ఈ ఎమ్మెల్యేలు యాక్టివ్ గా మారారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో టీడీపీలో కొత్త సమస్య మొదలైంది. నెల్లూరులో అసలైన టీడీపీ నేతలు వీరి తీరుతో మండిపడుతున్నారు.
నెల్లూరులో కొత్త రాజకీయం : నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జిల్లాలోకి టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కడప జిల్లా నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. అంతకు ముందే మాజీ మంత్రి..ఎమ్మెల్యే ఆనం జిల్లాలోకి లోకేశ్ యాత్ర ప్రవేశ సమయం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో ఎమ్మెల్యే మేకపాటి ఇప్పటికే లోకేశ్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబుతో సమావేశమైన ఆనం టీడీపీలో చేరేందుకు సిద్దమని సంసిద్దత వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముందుకొచ్చారు. పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకుందామని ఆనంకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

టీడీపీ నేతల గుర్రు : 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాల్లో వైసీపీ ఏకపక్షంగా సీట్లు సాదించింది. స్థానిక సంస్థలు..నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. నెల్లూరు జిల్లాలో ఎలాగైనా వైసీపీని దెబ్బ తీయాలనే చంద్రబాబు వ్యూహాలకు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు సహకరించారు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ టీడీపీలో చేరికకు సిద్దం అయ్యారు. అయితే, ఇప్పటి వరకు అధికార పార్టీలో ఉండి తమను ఇబ్బంది పెట్టిన నేతలకు తమ పార్టీలో తమకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం పైన నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ నాయకత్వం వైసీపీ ఎమ్మెల్యేల చేరికకు సుముఖంగా ఉన్నా వారితో కలిసి పని చేసే విషయంలో జిల్లా నేతలు పైకి అంతా ఓకే అంటున్నా....అంతర్గత చర్చల్లో మాత్రం అంగీకరించలేకపోతున్నారు.
రెబల్స్ కు ప్రాధాన్యత పై : ఆనంకు ఆత్మకూరు..కోటంరెడ్డికి నెల్లూరు రూరల్ సీట్ల పైన టీడీపీ నాయకత్వం నుంచి హామీ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నియోజవకర్గాల్లో ఎప్పటి నుంచో టీడీపీ నేతలు పని చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆ నియోజకవర్గాల నేతలకు పార్టీ నాయకత్వం హామీ ఇస్తోంది. అయితే ఏ పార్టీలో అయినా వారే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయటం ఏంటనేది టీడీపీ నేతల ప్రశ్న. నెల్లూరు జిల్లాలో కొందరు సీనియర్లు మినహా మిగిలిన నేతలంతా పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం పైన లోలోపల ఆగ్రహం తో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని బుజ్జగించేందుకు టీడీపీ నాయకత్వం ఏం చేస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications