మీ దగ్గర ఏం పని చేసి బ్రోకర్లం అయ్యాం?...పవన్ కల్యాణ్‌పై పిఠాపురం ఎమ్మెల్యే వర్మ సీరియస్..
తూర్పుగోదావరి:టిడిపి నేతలపై పవన్ కళ్యాణ్ ఆరోపణలపై పిఠాపురం టిడిపి ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలను పదేపదే బ్రోకర్లు అని సంబోధిస్తున్న తీరు సరిగా లేదని వర్మ తప్పుబట్టారు.
అసలు పవన్ కల్యాణ్‌కు భాషా సంస్కారం తెలియదని వర్మ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను, పరుష పదజాలాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. పవన్!..మీ దగ్గర ఏం పని చేశామని బ్రోకర్లం అయ్యామంటూ వర్మ నిలదీశారు. మేము ఏ పార్టీలోనైనా విలీనమయ్యామా?...లేక అమ్ముడు పోయామా?...అని పరోక్షంగా ప్రజారాజ్యంను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ల పంచలు ఊడదీసి కొడతామని భారీ డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత అదే కాంగ్రెస్‌లో కలసిపోయారని వర్మ ఎద్దేవా చేశారు. మంత్రి లోకేష్‌పై అనుచిత విమర్శలు చేయనిదే పవన్‌కు నిద్ర పట్టేలా లేదని వర్మ మండిపడ్డారు. సరే...లోకేష్ పంచాయతీ మెంబర్ కూడా కాలేదు.. మరి మీరు దేనికి మెంబర్ అయ్యారని వ్యంగాస్త్రాలు సంధించారు. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మీకులాగా సినిమాలు, నటన తెలియదని ఎద్దేవా చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలో భాగంగా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మా ఆడపడుచుపైనే దాడి చేస్తారా అంటూ స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్యే వర్మ గొల్లప్రోలు శానిటరీ ఇనస్పెక్టర్ శివలక్ష్మి చేతులతో మురుగు తీయించిన విషయాన్ని పవన్ ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

నేతలు పనులు చెప్పి చేయించుకోవాలి తప్ప ఇలా వ్యవహరిస్తారా?...అని పవన్ నిలదీశారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు పేకాట క్లబ్బులు నడుపుతున్నారని...మాతో ఓట్లు వేయించుకుని మాపై రాజుల్లా రాజ్యమేలతారా అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. ఎమ్మె ల్యేలు రాజులు కాదు, ప్రజలు వారికి బానిసలు కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు.












Click it and Unblock the Notifications