టీడీపీలో ఇక గీత దాటితే చర్యలే..!త్వరలో ఐదుగురితో కమిటీ..!
ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సొంత ఎమ్మెల్యేల నుంచి తలనొప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి, వారు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయని సీఎం చంద్రబాబు భావిస్తన్నారు. వీరి తీరుపై ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు.. ఇప్పటికే ప్రతీ కేబినెట్ భేటీలోనూ వీరిని కంట్రోల్ చేయాలని మంత్రులకు సూచనలు చేస్తూనే ఉన్నారు. దీంతో పాటు ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు.
రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల వివాదాలకు చెక్ పెట్టేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు భేటీలు నిర్వహించడంతో పాటు బహిరంగంగానే వీరికి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో 15-20 మంది ఎమ్మెల్యేలు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమో, ఇసుక, మద్యం అక్రమాల్లో తలదూర్చడమో చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీరికి అడ్డుకట్టే వేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరు మదించి, వారిని గాడిన పెట్టేందుకు వీలుగా టీడీపీ సీనియర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు గీత దాటితే వేటు పడుతుందన్న హెచ్చరికలు వారికి పంపాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఐదుగురు పార్టీ సీనియర్లతో ఈ కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ కమిటీ క్యాడర్ ను పట్టించుకోకుండా ఉండిపోతున్న ఎమ్మెల్యేలను సైతం గుర్తించనుంది.












Click it and Unblock the Notifications