చంద్రబాబు అరెస్టైన చోటే టీడీపీ పీఏసీ భేటీ-జూమ్ లో లోకేష్-కీలక నిర్ణయాలు ?
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు, నారా లోకేష్ అరెస్టుకు సీఐడీ చేస్తున్న ప్రయత్నాలు, ప్రజల్లోకి ఈ విషయాల్ని తీసుకెళ్లాల్సిన అవసరంపై ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నంద్యాలలో భేటీ అయింది. గతంలో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్లోనే ఈ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి ఢిల్లీలో ఉన్న పార్టీ నేత నారా లోకేష్ వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు మూడు కేసుల్లో సీఐడీ దూకుడు నేపథ్యంలో తాము కూడా ప్రజల్లోకి అంతే దూకుడుగా వెళ్లి ప్రభుత్వ తీరును ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా సీఐడీ లోకేష్ ను కూడా అరెస్టు చేస్తే చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల్లో వస్తున్న స్పందనను కొనసాగించేలా చేపట్టాల్సిన నిరసనలపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీలో బాలకృష్ణ,యనమల, అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, అశోక్ బాబు, వంగలపూడి అనిత, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్ వంటి నేతలు పాల్గొంటున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ భేటీకి హాజరైన లోకేష్ ఈ సందర్భంగా నేతలకు పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో పోరాటం చేస్తూ మరోవైపు పార్టీ నేతల్లో స్ధైర్యం దెబ్బతినకుండా చూసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications