రైతుల మహా పాదయాత్ర పేరుతో టీడీపీ రాజకీయ యాత్ర: ఎదురు దాడి మొదలెట్టిన వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని ఉద్యమం చేస్తున్న రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ మహా పాదయాత్ర సాగిస్తున్న విషయం తెలిసిందే. గత 11 రోజులుగా పాదయాత్ర సాగిస్తున్న రైతులు మొత్తంగా 45 రోజుల పాటు ఈ పాదయాత్రను నిర్వహించాల్సి ఉంది. అయితే గురువారం రోజు ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రైతులపై చదలవాడలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో రాజకీయ రగడ మొదలైంది.
టీడీపీ విమర్శలను తిప్పి కొడుతున్న వైసీపీ
తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తుంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర దెబ్బకు జగన్ కు భయం పట్టుకుందని, అందుకే పాదయాత్రను అడ్డుకోవడం కోసం లాఠీచార్జీలు చేస్తున్నారని, కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ ఒక ముసుగు వేసుకుని అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని వాళ్ళు ఇకనైనా కళ్లు తెరవాలని పేర్కొన్నారు.

రైతుల మహా పాదయాత్ర పేరుతో టీడీపీ రాజకీయ యాత్ర
157 మంది మాత్రమే పాల్గొంటామని జాబితా ఇచ్చి కోర్టు నుంచి అనుమతి పొందారని, ఇప్పుడు చంద్రబాబు సంఘీభావం పేరుతో రాజకీయ యాత్రలా మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజధాని పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శాసన రాజధాని అమరావతి ఎప్పటికీ కొనసాగుతుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసమే సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. రైతుల మహా పాదయాత్ర పేరుతో టిడిపి రాజకీయ యాత్ర చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు.
ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు
రైతుల సాగిస్తున్న మహాపాదయాత్ర మాత్రం పసుపు వర్ణంగా మారి సాగుతుందని, బినామీలను కాపాడడం కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారు అని మండిపడ్డారు. ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదు అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి పనులకు చంద్రబాబు అడుగడుగునా అడ్డు పడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు సాగిస్తుంది పాదయాత్ర కాదని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై దాడి అంటూ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. చంద్రబాబు విష కౌగిలిలో చిక్కి రైతులు విలవిలలాడుతున్నారు అని రాష్ట్రంలో ప్రాంతాల వారీగా అలజడి సృష్టించడం కోసమే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని సుధాకర్ బాబు ఆరోపించారు.
పాదయాత్రకు బయట నుండి జనాలను తరలిస్తున్నారు
పాదయాత్రకు టిడిపి నేతలు బయట ప్రాంతాల నుంచి జనాలను తీసుకు వస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు విమర్శించారు. చంద్రబాబు ఉన్మాద రాజకీయ నాయకుడని ఆరోపణలు గుప్పించిన సుధాకర్ బాబు రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్యాకేజీలు అందాయని, ఏడాదికి ఒకసారి కౌలు డబ్బులు వస్తున్నాయని, ఇతర అలవెన్సులు కూడా పొందుతున్నారని ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్రకు స్థానికంగా మద్దతు లేకపోవడం వల్లే ఇతర ప్రాంతాల నేతలను తరలిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు












Click it and Unblock the Notifications