టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట.. గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత!
తెలుగుదేశం పార్టీలోని మహిళలతోపాటు ఆ పార్టీపై మాజీ మంత్రి కొడాలి నాని అసభ్య పదజాలాన్ని ఉపయోగించడాన్ని ఖండిస్తూ టీడీపీ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పార్టీ నాయకులు పలువురు వివిధ మార్గాల ద్వారా గుడివాడకు బయలుదేరగా వారందరినీ మార్గమధ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య తదితరులను పామర్రు వద్ద అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆర్టీసీ బస్సుల్లో గుడివాడకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యేలు
మాజీ ఎమ్మెల్యేలు జయమంగళ వెంకట రమణ, బోడె ప్రసాద్, పెడన ఇన్‌ఛార్జి కాగిత వెంకట ప్రసాద్‌ల తదితరులు ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించడంద్వారా గుడివాడకు చేరుకున్నారు. వీరంతా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి కొడాలి నానిపై ఫిర్యాదు చేయడానికి వన్ టౌన్ పోలీస్‌స్టేసన్‌కు బయలుదేరగా వారిని మార్గమధ్యంలో టీడీపీ కార్యాలయంవద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఫిర్యాదు ఇక్కడైనా చేయవచ్చని పోలీసులు పేర్కొనగా.. లేదు.. స్టేషన్‌కు వచ్చే చేస్తామని బయలుదేరారు. ఈ విషయంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.

తోసుకున్న టీడీపీ నాయకులు, పోలీసులు
టీడీపీ నాయకులు పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించారు. వీరంతా పోలీస్ బందోబస్తు, బారికేడ్లను తోసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువైపులా తోపులాట జరిగింది. అనంతరం రోప్ పార్టీని, బారికేడ్లను తోసుకుని ముందుకెళ్తూ కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేషన్ చేరుకున్నారు. అప్పటికే వన్ టౌన్ పోలీసులు స్టేషన్ గేటు మూసివేయడంతో ఆగ్రహించిన నాయకులంతా ఫిర్యాదు చేయడానికి వస్తే తాళాలు వేసుకోవడం ఏమిటంటూ అక్కడే ఆందోళనకు దిగారు.

స్టేషన్ లో ఫిర్యాదు
గుడివాడ వన్ టౌన్ సీఐ గోవిందరాజు, దిశ డీఎస్పీ రాజ్‌కుమార్, గన్నవరం డీఎస్పీ విజయ్‌పాల్ తదితరులు తెలుగుదేశం పార్టీ నేతలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. గుంపులు గుంపులుగా స్టేషన్‌కు రావడం సరికాదని.. నలుగురు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని కోరారు. దీంతో రావి వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, బోడె ప్రసాద్, కాగిత వెంకట కృష్ణప్రసాద్ స్టేషన్‌లోకి వెళ్లి మాజీ మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా ఫిర్యాదు అందజేశారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోందని.. మహిళలపై గౌరవం లేకుండా చట్ట సభలు, మీడియా సమావేశాల్లో తీవ్ర పదజాలం ఉపయోగిస్తున్నారంటూ జయమంగళ వెంకటరమణ మండిపడ్డారు. నడిరోడ్డుపై పోలీసులు ఫిర్యాదు తీసుకుంటామని చెబుతున్నారని, స్టేషన్‌లోకి రాకుండా తాళాలు వేయడం లాంటివన్నీ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనమని రావి వెంకటేశ్వరరావు, బోడె ప్రసాద్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications