టీడీపీ బిగ్ యూటర్న్ ? ఈసీ భేటీలో రిమోట్ ఈవీఎంకు మద్దతు ! గతంలో బ్యాలెట్ బాక్సులకు పట్టు.. !
ఏపీలో ప్రధాన విపక్షం ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఇవాళ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పార్టీలతో ఈసీ భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం గతంలో తాము తీసుకున్న ఓ విధాన పరమైన నిర్ణయానికి పూర్తి భిన్నంగా ఉండటంతో టీడీపీ యూటర్న్ పై చర్చ జరుగుతోంది. ఇంతకీ గతంలో టీడీపీ ఏం చెప్పింది ? ఇప్పుడేం చేసిందో ఓసారి చూసేద్దాం...

ఈవీఎంల వాడకంపై టీడీపీ
ఏపీలో 2019కు ముందు బీజేపీతో జట్టు కట్టి ఆ తర్వాత విడిపోయిన టీడీపీ... అప్పట్లో ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈవీఎంల కారణంగా ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వాటి స్ధానంలో తిరిగి బ్యాలెట్ బాక్సుల్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబు ఈసీకి, కేంద్రానికి ప్రతిపాదించారు. అయినా వాటిపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈవీఎంలపై జాతీయ స్ధాయిలో ఇతర రాజకీయ పార్టీలతో పాటు కేంద్రంపై ఓ చిన్నసైజు యుద్దమే చేశారు. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో సడన్ గా స్టాండ్ మార్చేశారు.

రిమోట్ ఈవీఎంలకు టీడీపీ సై !
భవిష్యత్తులో ఎన్నికల్లో వాడేందుకు ఈసీ వాడబోతున్న రిమోట్ ఓటింగ్ యంత్రంపై అవగాహన కలిగించేందుకు డిల్లీలో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఈ సమావేశంలో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, ఎన్.ఆర్.ఐ వింగ్ సభ్యుడు వేమూరి రవికుమార్ పాల్గొన్నారు. వీరిద్దరూ రిమోట్ ఈవీఎంల వాడకంపై తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఇందులో వారు రిమోట్ ఈవీఎంల ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఈసీ తీసుకొస్తున్న రిమోట్ ఈవీఎంలతో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

టీడీపీ వాదన ఇదే
రిమోట్ ఓటింగ్ యంత్రంతో ఓటు హక్కును ఎక్కడి నుంచైనా వినియోగించుకునే వీలుందని ఇవాళ భేటీలో పాల్గొన్న టీడీపీ నేతలు ఈసీకి తెలిపారు. రిమోట్ ఓటింగ్ యంత్రంతో ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా వలస ఓటర్లకు ఎంతో ఉపయోగపడనుందని వారు వెల్లడించారు. కాబట్టి రిమోట్ ఈవీఎంలను తీసుకురావాలని వారు ఈసీకి సూచించారు. ఇప్పటికే దేశంలో పలు రాజకీయ పార్టీలు రిమోట్ ఓటింగ్ యంత్రంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ స్టాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈవీఎంలపై టీడీపీ యూటర్న్ వెనుక.. ?
ఎన్నికల్లో ఓటింగ్ కోసం వాడుతున్న ఈవీఎంల వల్ల పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అప్పట్లో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పై పోరాడిన టీడీపీ.. ఇప్పుడు మారిన పరిస్దితుల్లో రిమోట్ ఈవీఎంల ప్రతిపాదనకు మొగ్గు చూపింది. దీని వెనుక బీజేపీతో బలపడుతున్న టీడీపీ బంధమే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో కేంద్రం కానీ, ఈసీ కానీ చేసి ప్రతిపాదనలకు టీడీపీ మోకాలడ్డితే దాని ప్రభావం కచ్చితంగా అది భవిష్యత్ రాజకీయాలు, పొత్తులపై పడే అవకాశం ఉండటంతో టీడీపీ ఇలా మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. అసలే దేశంలో బీజేపీయేతర పార్టీలు రిమోట్ ఈవీఎంలను వ్యతిరేకిస్తున్న వేళ టీడీపీ మద్దతు మోడీ సర్కార్ కు ఊరట కానుంది.












Click it and Unblock the Notifications