ఏలూరు ఎంపీ సీటుకు చంద్రబాబు అనూహ్య ఎంపిక-ఎవరీ పుట్టా మహేష్ యాదవ్ ?
ఏపీలో టీడీపీ ఇవాళ ప్రకటించిన అభ్యర్ధుల మూడో జాబితాలో కొన్ని అనూహ్య ఎంపికలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఏలూరు ఎంపీ అభ్యర్ధిగా పుట్టా మహేష్ యాదవ్ ఎంపిక కూడా అలాంటిదే. కొన్ని దశాబ్దాలుగా ఏలూరు ఎంపీ సీటులో కమ్మ సామాజిక వర్గ అభ్యర్ధులకే అవకాశాలు ఇస్తున్న టీడీపీ.. ఈసారి మాత్రం రూటు మార్చి బీసీ అభ్యర్ధికి అవకాశం ఇస్తోంది. ఇంతకీ ఈ పుట్టా మహేష్ యాదవ్ ఎవరు ?, టీడీపీ ఆయన్ను ఎంచుకోవడం వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడే. అంతే కాదు గతంలో మైదుకూరు నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకే. టీడీపీ ఈసారి అనూహ్యంగా పుట్టా మహేష్ యాదవ్ ను తమ సంప్రదాయ కమ్మ సీటు అయిన ఏలూరు ఎంపీ స్ధానంలో బరిలోకి దింపుతోంది. ఇలా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ యాదవ్ ను టీడీపీ ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి.

గతంలో ఏలూరు ఎంపీ సీటులో వెలమదొర అయిన కోటగిరి శ్రీధర్ ను బరిలోకి దింపి జగన్ హవాలో గెలిపించుకున్న వైసీపీ.. ఈసారి మాత్రం కారుమూరి సునీల్ యాదవ్ అనే కొత్త అభ్యర్ధిని దించింది. ఆయన ఎవరో కాదు ప్రస్తుత జగన్ కేబినెట్ మంత్రి, తణుకు ఎమ్మెల్యే కూడా అయిన కారుమూరి నాగేశ్వరరావు కొడుకే. ఈసారి బీసీలకు పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో వైసీపీ కారుమూరి సునీల్ యాదవ్ ను ఎంచుకోవడంతో టీడీపీ కూడా బీసీ అభ్యర్ధివైపే మొగ్గు చూపాల్సి వచ్చింది.
అదే సమయంలో పార్టీలో ఉన్న బీసీ అభ్యర్ధుల్లో ఏలూరు ఎంపీ సీటులో నిలబెట్టేంత నేతలు ఎవరూ లేరు. దీంతో పొరుగున ఉన్న కాకినాడ జిల్లా తునికి చెందిన పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాపులు, కమ్మ సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉండే ఏలూరు ఎంపీ సీటులో బీసీల జనాభా కూడా ఎక్కువే ఉంది. దీంతో పవన్, చంద్రబాబు వెనుక ఉన్న కాపులకు తోడు బీసీ ఓట్ల కోసం మహేష్ యాదవ్ ను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications