గౌరవిస్తున్నా సభకు రాకపోవడమేంటి ? జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫైర్...
ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలకు మొదటి రోజు హాజరై ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్... రెండోరోజు మాత్రం మొహం చాటేశారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ సీఎంగా గౌరవంగానే చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ గురించి పరుషంగా మాట్లాడకుండా సహనం పాటిస్తున్నారు. అయినా జగన్ రెండోరోజు అసెంబ్లీకి రాకపోవడం, కనీసం వైసీపీ ఎమ్మెల్యేలను అయినా పంపకపోవడంపై టీడీపీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ లాబీల్లో మీడియాతో కాసేపు చిట్ చాట్ చేసిన టీడీపీ సీనియర్ ఎంఎల్ఏ ధూళిపాళ్ల నరేంద్ర జగన్ తీరుపై స్పందించారు. స్పీకర్ ఎన్నికకు జగన్ గైర్హాజరు కావడం బీసీలను అవమానించటమేనన్నారు. జగన్ కు వ్యక్తిగత పని ఉంటే, మిగిలిన సభ్యులు గైర్హాజరను ఎలా చూడాలని ప్రశ్నించారు. ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా ఇంకా అహంకారం దిగలేదు అనుకోవాలా అని అడిగారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నామన్నారు.

ప్రతిపక్ష హోదా లేని జగన్ కారు అసెంబ్లీ లోనికి రానిచ్చాం, ప్రతిపక్ష హోదా లేకపోయినా మంత్రుల తర్వాత ఎమ్మెల్యే గా ప్రమాణం చేయించాం, ఇచ్చే గౌరవాన్ని కూడా కాపాడుకోను అంటే ఎలా అని ధూళిపాళ్ల జగన్ ను ప్రశ్నించారు. మేం ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, సభా సంప్రదాయాలు పాటించామన్నారు. లేని హోదా కోరుకుంటూ వైసీపీ సభను ఎగ్గొట్టే సాకులు వెతుక్కుంటోందన్నారు. ప్రజా తీర్పు గౌరవించే ధైర్యం కూడా జగన్ చేయట్లేదన్నారు.
పరిటాల రవి హత్య జరిగిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయని, మాలో ఎంతో ఆవేశం ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటం చేసి వ్యవస్థలను గౌరవించామని ధూళిపాళ్ల గుర్తుచేసుకున్నారు. జగన్ అధికారం లో ఉండగా వ్యవస్థల్ని నాశనం చేశారు అధికారం పోయాక సంప్రదాయాలు కూడా పాటించట్లేదన్నారు. సభ హుందాగా నడవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నదే చంద్రబాబు ఆలోచన అన్నారు. అందుకు సహకరించం అన్నట్లుగా జగన్ తీరు ఉంటే తామేం చేయాలని ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించాం, వాస్తవాలు గ్రహించం అన్నట్లు వైసీపీ వ్యవహరిస్తుంటే వారికే నష్టమన్నారు.












Click it and Unblock the Notifications