తాలిబన్-తాడేపల్లి డ్రగ్స్ రాకెట్, తెలంగాణా సరిహద్దుల్లో నిఘా ; బిగ్ బాస్ పైనే డౌట్ : వదిలిపెట్టని టీడీపీ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వదిలిపెట్టడం లేదు. జగన్ ను, జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా విజయవాడ కేంద్రంగా వేలకోట్ల తాలిబన్ తాడేపల్లి డ్రగ్ రాకెట్ పై తెలంగాణ అలర్ట్ అయ్యిందంటూ తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ నుండి వచ్చే వాహనాలపై పటిష్టమైన నిఘా పెట్టింది అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అందులో ఏపీ నుంచి వచ్చే అన్ని బోర్డర్ లలో నిఘా పెంచాలని తెలంగాణను కేంద్ర నిఘా సంస్థలు కోరాయని పేర్కొన్నారు. అంతే కాదు ఒక పక్క ఏపీ ప్రభుత్వం తమకు సంబంధం లేదని చెబుతున్న కేంద్రం మాత్రం ఏపి బిగ్ బాస్ వ్యవహారశైలిపై అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తోంది ? అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

భారీ డ్రగ్స్ పట్టుబడటంతో డీఆర్ఐ నిఘా .. వైసీపీపై విమర్శలు
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడంతో ఒక్కసారిగా డ్రగ్స్ వ్యవహారం దుమారంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ స్మగ్లింగ్ జోరుగా జరుగుతోందని డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన సుధాకర్ వైసీపీ నాయకుడి బినామీ అని పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నారు . ఆఫ్ఘనిస్తాన్ నుండి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు అక్రమ రవాణా జరుగుతూ పట్టుబడిన హెరాయిన్ రవాణా షిప్ మెంట్ పై విజయవాడ అడ్రస్ ఉండడంతో ఏపీలో డ్రగ్స్ స్మగ్లింగ్ బాగా జరుగుతుందని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఇటీవల భారీగా డ్రగ్స్ పట్టుబడటంతో డీఆర్ఐ అధికారులు నిఘా పెంచటంపై కూడా ఏపీ ప్రతిపక్ష టిడిపి, అధికార వైసీపీ ని టార్గెట్ చేస్తోంది.

ఏపీ నుండి వచ్చే వాహనాలపై తెలంగాణా సరిహద్దుల్లో నిఘా వెనుక డ్రగ్స్
రూ .9,000 కోట్ల విలువైన 2,998 కిలోల హెరాయిన్ పట్టుబడిన తరువాత తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల నుండి వస్తున్న వాహనాలపై, సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచాలని తెలంగాణా రాష్ట్ర పోలీసులను హైదరాబాద్ జోన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న తరువాత ఈ ఆదేశాలు ఇచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ భారీగా హెరాయిన్ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పోలీసు విభాగానికి సమాచారం ఇచ్చింది . హైవే మార్గాల్లో నిఘా పెంచాలని డిపార్ట్‌మెంట్‌ని కోరింది.

డ్రగ్స్ కేసులో జోరుగా కొనసాగుతున్న దర్యాప్తు .. తెలుగు రాష్ట్రాలపై డీఆర్ ఐ అధికారుల ఫోకస్
గుజరాత్ పోర్టులో డ్రగ్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి డిఆర్ఐ శాఖ దీనిపై సమగ్రంగా దర్యాప్తు మొదలు పెట్టింది. విశాఖపట్నం మరియు ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతాల నుండి మహారాష్ట్ర , గోవా వంటి ఇతర రాష్ట్రాలకు గంజాయి మరియు ఇతర డ్రగ్స్ సరఫరా చేయబడుతున్నాయని గుర్తించి సంబంధిత ప్రాంతాలలో సోదాలు చేపట్టింది. డ్రగ్స్ వ్యాపారంలో కింగ్‌పిన్‌లు హైదరాబాద్‌లో కూడా తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తూ హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టింది.

ఆఫ్ఘనిస్థాన్ విద్యార్థుల డేటా సేకరణ .. ఆఫ్ఘన్ జాతీయుల విచారణ
"పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్గనిస్తాన్ విద్యార్థుల డేటాను ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) నుండి సేకరిస్తోంది . ఎవరైనా ఆఫ్ఘన్ విద్యార్థి అనుమానాస్పదంగా కనిపించినట్లయితే అతడిని ప్రశ్నించడానికి అదుపులోనికి తీసుకోనుంది. అయితే ఇప్పటి వరకు అలాంటి అనుమానితులను అదుపులోకి తీసుకోలేదు కానీ పోలీస్ శాఖ డిఆర్‌ఐ అధికారులతో పాటు భద్రతను పెంచింది. ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్న సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ యొక్క బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా సెప్టెంబర్ 13-14 తేదీలలో గుజరాత్‌కు రవాణా చేయబడింది. హెరాయిన్ సెమీ ప్రాసెస్డ్ ఆఫ్ఘన్ టాల్క్ కంటైనర్ల లోపల రవాణా చేయబడింది. దీనిని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక సంస్థ దిగుమతి చేసుకుంది. చెన్నైకి చెందిన ఒక జంటను అరెస్టు చేసిన అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌కు చెందిన అనేక మంది ఆఫ్ఘన్ జాతీయులను ఏజెన్సీలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

డ్రగ్స్ విషయంలో వైసీపీని, జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ
ఇక తెలంగాణ సరిహద్దుల్లో, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో నిఘా పెంచడంపై ఏపీలో ప్రతిపక్ష టీడీపీ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బిగ్ బాస్ పై కేంద్రానికి అనుమానం ఉందని అందుకే డ్రగ్స్ రాకెట్ పై అలర్ట్ అయిందని పేర్కొంటుంది. ఏది ఏమైనా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ఇరకాటంలో పెట్టేలా డ్రగ్స్ స్మగ్లింగ్ పై పదేపదే టిడిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తోంది. అంతేకాదు డ్రగ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి బిగ్ బాస్ ప్రయత్నం చేస్తున్నాడా అంటూ జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తోంది.

మహిళలపై దాడులకు డ్రగ్స్ కూ లింక్ పెట్టి.. వదిలిపెట్టట్లేదుగా
ఇక రాష్ట్రంలో మహిళలపై విచ్చలవిడిగా జరుగుతున్న దాడులకు, డ్రగ్స్ వాడకం కూడా ఒక కారణం అంటూ డ్రగ్స్ కు దాడులకు లింకు పెట్టి మరి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి డ్రగ్స్ స్మగ్లింగ్ జరగడం లేదని, ముంద్రా పోర్ట్ కు వచ్చిన డ్రగ్స్ కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉంది. తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది.