ఆ కీలక నియోజకవర్గంపై టీడీపీకి ఆశలు లేనట్లేనా..?
ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఎనిమిది నెలలు సమయం ఉన్నప్పటికీ..అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. నారా లోకేష్ యువగళంతో పాదయాత్ర చేస్తూంటే... పవన్ వారాహి యాత్ర చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల టూర్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక వైసీపీ అధినేత, సీఎం జగన్ సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ప్రతిపక్షాలపై మాటల దాడిని కొనసాగిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 175 సీట్లను గెలవడమే అధికార పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంటే.. రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా జగన్‌ను ఓడించి అధికారం చేపట్టాలని టీడీపీ , జనసేన పార్టీలు భావిస్తున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత కనిపిస్తోంది. ఓ కీలక నియోజకవర్గంలో టీడీపీకి ఇప్పటి వరకూ సరైన అభ్యర్థి లేరని కార్యకర్తలు వాపోతున్నారు. ఆ నియోజకవర్గం మరేదో కాదు..ఎన్టీఆర్ జిల్లాలోని నూజివీడు.

గడిచిన 10 సంవత్సరాలుగా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీకి సరైన అభ్యర్థి కనిపించడం లేదు. ప్రస్తుతం నూజివీడు టీడీపీ ఇంచార్జ్‌గా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. ఆయన 2014,2019 వరుస ఎన్నికల్లో ఓడిపోయారు. ముద్దరబోయిన స్థానిక నేత కాకపోవడంతోనే ఓడిపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చాలని క్యాడర్ కోరుకుంటుంది. నూజివీడు నియోజకవర్గం నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. ఆయన నూజివీడు నుంచి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
మేకా వెంకట ప్రతాప్ అప్పారావును ఎదుర్కొవడం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వల్ల కావడం లేదని.. అధికార పార్టీ మీద దూకుడుగా ఉండే అభ్యర్థి కావాలని టీడీపీ కార్యకర్తలు పార్టీ అధినేతను డిమాండ్ చేస్తున్నారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త పర్వతనేని గంగాధర్ నూజివీడు నియోజకవర్గం టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్నారు.టికెట్ తమకంటే తమకేనని ఇరువర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.

పార్టీ కార్యక్రమాలను కూడా ఎవరికి వారు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. గ్రూపు తగాదాలతో నేతల మధ్య విభేదాలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇవ్వన్ని కలగలిసి నియోజకవర్గంలో పార్టీని రేసులో లేకుండా చేస్తున్నాయని కార్యకర్తలు బాధపడుతున్నారు. నూజివీడు నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థి గెలిచిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదని టీడీపీ క్యాడరే చెప్పడం సంచలనంగా మారింది. మరి నూజివీడు నియోజకవర్గ సమస్యపై పార్టీ అధినేత చంద్రబాబు కలుగజేసుకుని ఎలాంటి పరిష్కరం చూపుతారో చూడాలి.












Click it and Unblock the Notifications