హీరో నానీ వ్యాఖ్యలతో దొరికిన వైసీపీ; నిత్యావసరాల ధరలపై టీడీపీకి అస్త్రం: లాజిక్ తో కొట్టారుగా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సినిమా టికెట్ల విషయంలో ధరలను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో మొదలైన దుమారం అధికార వైసిపి వర్సెస్ ప్రతిపక్ష టిడిపిగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి టాలీవుడ్ హీరో నాని వ్యాఖ్యల తర్వాత జగన్ సర్కార్ ను టార్గెట్ చేయడానికి మరో కొత్త అస్త్రం దొరికినట్లైంది.

ఏపీలో సినిమా టికెట్ల రగడ ..
ఏపీలో సినిమా టికెట్లు అంశం పై శ్యామ్ సింగరాయ్ మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సినిమా థియేటర్లు కంటే పక్కన ఉండే కిరణా షాప్ వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారని, టికెట్ల రేటు తగ్గించడం ప్రేక్షకులను అవమానించడమేనని నాని వ్యాఖ్యలు చేశారు. దీంతో హీరో నానికి వైసీపీ మంత్రులు ఘాటుగా సమాధానమిచ్చారు. టికెట్లు రేట్లు తగ్గించటం ప్రేక్షకులను అవమానించటం ఎలా అవుతుందో హీరో నాని చెప్పాలంటూ మంత్రి కన్నబాబు ప్రశ్నించగా, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా టిక్కెట్ ధరలను తగ్గించామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సినిమా టికెట్ల ధరలను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకోవడానికి వీల్లేదని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు.

టీడీపీ నేతలకు అస్త్రంగా సినిమా టికెట్ల ధరల రగడ
ఇక ఇదే తెలుగుదేశం పార్టీ నేతలకు అస్త్రంగా మారింది. సామాన్యులకు అందుబాటు ధరలలో ఉండేవిధంగా సినిమా టికెట్ల ధరలను తగ్గించారు కానీ, రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం పై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదు దేనికి? అంటూ ప్రశ్నిస్తున్నారు. విపరీతంగా పెరిగిపోయిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించడానికి పెద్ద ఎత్తున ప్రజలు పోరాటాలు చేసినా వైసిపి ఎందుకు డీజిల్ పెట్రోల్ ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించలేదని ప్రశ్నిస్తున్నారు.

ఈ శ్రద్ధ నిత్యావసర వస్తువుల ధరలపై ఎందుకు లేదు? టీడీపీ ప్రశ్న
సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై పెట్టిన శ్రద్ధ ఎందుకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గింపుపై పెట్టడం లేదో జగన్ సర్కార్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే సినిమా టికెట్ల ధరల పై మంత్రుల తీరును నిరసిస్తూ వంగలపూడి అనిత, బుద్ధ వెంకన్న తదితరులు తమదైన శైలిలో రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలేశారని, కావాలని సినీ పరిశ్రమపై పడ్డారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక తాజాగా టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
సినిమా టికెట్ల ధరలు, లిక్కర్ ధరలు తగ్గించటంపై చూపిన ఆసక్తి పెట్రోల్, డీజిల్ ధరలపై లేదేం
సినిమా అందరికీ అందుబాటులో ఉండాలి అందుకే ధరలు తగ్గించాం అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని, మరి నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండక్కర లేదా వైయస్ జగన్ గారు అవి కూడా తగ్గించండి అని ప్రజలు అంటున్నారని సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ప్రభుత్వం దగ్గర దీనికి సమాధానం ఉందా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల హర్షించే నిర్ణయాలు తీసుకుంటే మంచిదని హితవు పలికారు. లిక్కర్ అనేది నిత్యవసర వస్తువు కాకున్నా, ప్రభుత్వం లిక్కర్ రేట్లు తగ్గిస్తుందని, కానీ నిత్యావసరంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు.
Recommended Video

ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు.. ఆ ధరలు తగ్గించండి : జగన్ ను టార్గెట్ చేసిన గోరంట్ల
లిక్కర్ రేట్లు తగ్గించినట్టు అదే స్ఫూర్తితో పెట్రోల్ డీజిల్ పై ఉన్న రాష్ట్ర పన్నులు తగ్గిస్తే యావత్ ప్రజానీకానికి మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు. మీ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలను బలి చేయడం మంచిది కాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మొత్తానికి ఈ సినిమా టిక్కెట్ల ధరల వివాదం ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి నిత్యావసర ధరల విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఆయుధంగా మారగా, ప్రభుత్వం దీనిపై సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది. టీడీపీకి దొరక్కుండా నిర్ణయాలు తీసుకోవాలని జగన్ సర్కార్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఏదో ఒక రకంగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ, వైసీపీల మధ్య వార్ నిత్యకృత్యంగా మారింది.












Click it and Unblock the Notifications