టి-టిడిపి ప్రత్యేక శాఖ: ఎర్రబెల్లి, బొత్సకు విహెచ్ నిలదీత
హైదరాబాద్: త్వరలో తెలంగాణ టిడిపి శాఖను ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు గురువారం చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బందులకు గురి చేసేందుకే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు.
అఖిల పక్ష సమావేశానికి పార్టీలు కాకుండా ఇరు ప్రాంతాల ఐక్యకార్యాచరణ సమితిలు వెళ్తే సరిపోతుందన్నారు. సమైక్యవాద టిడిపిని తాము తెలంగాణకు ఒప్పించామన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమర్థిస్తారని చెప్పారు. పార్టీ నుండి పయ్యావుల కేశవ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

బొత్సను నిలదీసిన విహెచ్, జానా రెడ్డి!
మళ్లీ అఖిల పక్ష సమావేశం వేయడంపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి జానా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావులు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను ఈ విషయమై నిలదీసినట్లుగా తెలుస్తోంది. మళ్లీ అఖిల పక్షం ఏమిటని ప్రశ్నించారు.
విభజనపై పునరాలోచన ఉండదు: విహెచ్
విభజనపై కాంగ్రెసు పార్టీ నిర్ణయంలో పునరాలోచన ఉండదని వి హనుమంత రావు చెప్పారు. తెలంగాణపై బిజెపి వెనక్కి పోతే ఆ పార్టీ పని అయిపోతుందన్నారు. సమస్యల పైన చర్చించేందుకే అఖిల పక్ష సమావేశమన్నారు.












Click it and Unblock the Notifications