పవన్ ను ఓడిస్తామన్న మహాసేన రాజేష్ పై చర్యలకు టీడీపీ వెనకడుగు? కారణమిదే.. !
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ నేత మహాసేన రాజేష్ రేపిన కలకలం విపక్ష ఎన్డీయే కూటమితో పాటు ఇతర రాజకీయ పక్షాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన, ఇంకా చెప్పాలంటే కూటమి ఏర్పాటులో కీలకమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమ మహాసేన రాజేష్ చేసిన విమర్శలు, జనసేన పార్టీ అభ్యర్ధుల్ని ఓడిస్తామంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ మౌనం వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
గతంలో వైసీపీలో పనిచేసి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన మహాసేన రాజేష్ విషయంలో జనసేన నేతలకు ముందనుంచీ సదభిప్రాయం లేదు. గతంలో వివిధ కులాలపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసిన రాజేష్ కు టీడీపీ పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా టికెట్ ఇవ్వగానే దాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నాయకులు బహిరంగంగానే నిరసన తెలిపారు. చివరకు జనసేన ఒత్తిడితో టీడీపీ అధినేత చంద్రబాబు రాజేష్ ను ఒప్పించి పి.గన్నవరంలో పోటీ నుంచి విరమింపజేశారు.

అయితే ఆ కోపమో, లేక ఆ తర్వాత ఎన్డీయే కూటమి పెడుతున్న రోడ్ షోలు, సభలకు పిలవడం లేదనే అసంతప్తో తెలియదు కానీ మహాసేన రాజేష్ తాజాగా యూట్యూబ్ వీడియోలో పవన్ కళ్యాణ్ పై రెచ్పిపోయారు. పవన్ కళ్యాణ్ కు ఓడించకపోతే రాష్ట్రానికి ప్రమాదం అంటూ ఆయన చేసిన వీడియో ఎన్డీయే కూటమిలో తీవ్ర కలకలం రేపింది. జనసైనికులు దీనిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఏకంగా పవన్ తో పాటు జనసేన అభ్యర్ధుల్ని ఓడిస్తామంటూ రాజేష్ విసిరిన సవాల్ పై టీడీపీ నేతలు స్పందించలేదు.
కూటమి ధర్మం ప్రకారం చూసినా రాజేష్ వ్యాఖ్యలపై టీడీపీ స్పందించి చర్యలు తీసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. రాజేష్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. దీని వెనుక అసలు కారణం మరోలా ఉంది. గోదావరి జిల్లాల్లో ఎస్సీలకూ, కాపులకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంటుంది. దీంతో దళితుడైన మహాసేన రాజేష్ పై జనసేన కాపు నేతలకూ వైరం నెలకొంది.
ఇప్పుడు రాజేష్ పై టీడీపీ చర్యలు తీసుకుంటే గోదావరి జిల్లాల్లో ఆయనకు మద్దతుగా నిలుస్తున్న సామాజిక వర్గాల్ని ఆయన రెచ్చగొట్టే అవకాశాలున్నాయి. ఎన్నికల వేళ ఇది టీడీపీకి తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మహాసేన రాజేష్ విషయంలో టీడీపీ సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications