సోషల్ మీడియా కార్యకర్తలకు టీడీపీ వార్నింగ్ ! పవన్ పై పోస్టులు పెట్టొద్దు..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన విపక్ష పార్టీలు టీడీపీ-జనసేనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యర్ధులు పోస్టులు పెడుతున్నారు. వాటికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్ధుల ఉచ్చులో పడి తమతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు పెడుతున్న పోస్టులతో అధిష్టానం ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో వారికి ఇవాళ కీలక సూచన చేసింది.

ఈ మూడు నెలలూ పార్టీ సోషల్ మీడియా కు మద్దతుగా పని చేద్దాం అనుకునే వారికి.. సోషల్ మీడియాను తమ భుజాలపై మోస్తున్న వారికి విజ్ఞప్తి అంటూ టీడీపీ ఓ పోస్టు పెట్టింది. ఇందులో సోషల్ మీడియా ద్వారా పార్టీకి ఉపయోగపడే విధంగా పోస్ట్ లు పెట్టాలి అనుకుంటే పార్టీ చేసిన మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమం, పార్టీ నాయకత్వం యొక్క దూర దృష్టి, వారి విజయాలు మొదలగునవి పెట్టాలని, అలాగే వైసీపీ వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు, విధాన నిర్ణయాలలో తప్పులు, అధికార పార్టీ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు మొదలగు విషయాలకు మాత్రమే తమ పోస్ట్ లను పరిమితం చేయగలరంటూ సూచించింది.
అలాగే బీఆర్ఎస్ పై, కాంగ్రెస్ పై, బీజేపీ పై, సినిమా నటీ నటులపై, జనసేన పై (పార్టీ అధికారికంగా టీడీపీ - జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి అని చెప్పాక, ఒకే వేదిక ద్వారా రెండు పార్టీల అధినేతలు సందేశం ఇచ్చాక కూడా) ఇలా పలు సంబంధం లేని విషయాలపై స్పందించకుండా ఉండగలరని విజ్ఞప్తి చేసింది. పార్టీ సోషల్ మీడియాలో ప్రభావశీలురు అయ్యుండి, సంబంధం లేని ఇటువంటి విషయాలపై పోస్టులు పెడుతున్నట్లయితే, మనల్ని చూసి మరొక నలుగురు అదే దారిలో రావడం జరుగుతుంది.. దీని వల్ల పార్టీకి ప్రయోజనం లేకపోగా నష్టం వాటిల్లుతుందని తెలిపింది.
ఇలాంచి చర్యల వల్ల పార్టీ ప్రజల్లోకి తీసుకువెళదాం అని భావించిన విషయాల కంటే ఎక్కువగా.. ఇతరుల ఫోకస్ అంతా వీటిపై పడడంతో.. అసలు ప్రజల్లోకి వెళ్లాల్సిన విషయాలు పక్కదారి పడుతున్నాయని తెలిపింది. మరీ ముఖ్యంగా పార్టీలో, పార్టీ అనుబంధ విభాగాలలో వివిధ పదవులలో, హోదాలలో ఉన్నవారు తమ బాధ్యతను మరిచి, పూర్తి బాధ్యతా రాహిత్యంతో వివాదాస్పద పోస్టులు పెట్టకుండా లేదా వివాదాల్లో దూరకూండా .. పార్టీ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, తమకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధతో నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
దారి తప్పి పోస్టులు పెడుతున్న వారిని వారించాల్సింది పోయి, వారితో కలిసి మరింతగా పార్టీకి నష్టం కలిగించే రాతలు రాయడం ఆపాలని విజ్ఞప్తి చేసింది. టీడీపీ - జనసేన పొత్తు, అభ్యర్థుల ఎన్నిక, తదితర అంశాలను పూర్తిగా పార్టీ అధినాయకత్వానికి వదిలేసి, మన బాధ్యతను, పరిధిని సోషల్ మీడియా వరకూ పెట్టుకొని ఆ పరిధిలో వైసీపీని ఎప్పటికప్పుడు ఎలా ఓడిస్తూ ముందుకుపోవాలి అనే దానిపై శ్రద్ధ పెట్టాల్సిందిగా మనవి చేసింది.
ఇంకా ఎవరైనా, పార్టీ గీసిన హద్దులు దాటి అటువంటి పోస్ట్ లు పెడుతూ ఉన్నట్లయితే, అటువంటి వారిని నివారించండి.. వీలయితే అట్టి పోస్ట్ లను వారిచే డిలీట్ చేయించండని కోరింది. లేదా అటువంటి వారి పోస్టులకు స్పందించకుండా వదిలేయండని తెలిపింది. జనసేన ముసుగులో లేదా ఏదైనా కులం ముసుగులో ఐప్యాక్ పేటీఎం ఎకౌంట్స్ వచ్చి రెచ్చ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, మాట్లాడినా అటువంటి వారికి కూడా బదులు ఇవ్వకుండా, స్పందించకుండా వదిలేసినట్లయితే, వారే ప్రయత్నించి, ప్రయత్నించి ఆఖరుకు వారి కోరిక నెరవేరక వారే ఆగిపోతారని వెల్లడించింది.
తరచూ పార్టీకి, నాయకుడికి మద్దతుగా పోస్టులు పెడుతూ.. ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉండి సోషల్ మీడియాలో ప్రభావశీలురు అయినా వారు దయచేసి వివాదాస్పద పోస్టులకు ఈ మూడు నెలలూ దూరంగా ఉండాలని, స్వీయ నియంత్రణ మరో వంద మందికి మార్గదర్శకంగా ఉంటుందని తెలిపింది.












Click it and Unblock the Notifications