రాజ్యసభ - జగన్ టీమ్ దే ఆధిపత్యం : టీడీపీకి ఇప్పట్లో నో ఛాన్స్ - ఏపీ సభ్యులంతా ..!!
పెద్దల సభ..రాజ్యసభలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒక రాష్ట్రం నుంచి మొత్తం ఒకే పార్టీ వారే సభ్యులుగా ఉండనున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఖాళీల భర్తీకి షెడ్యూల్ జారీ అయింది. అందులో ఏపీ నుంచి నాలుగు స్థానాలు భర్తీ కానున్నాయి. ఏపీ నుంచి మొత్తం రాజ్యసభ స్థానాల కోటా 11. ప్రస్తుతం ఐదుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులున్నారు. తాజాగా జారీ అయిన షెడ్యూల్ లో భర్తీ చేసే నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అప్పుడు వైఎస్సార్‌సీపీ బలం ఐదు నుంచి తొమ్మిదికి పెరుగుతుంది.

పెద్దల సభలో పెరిగుతున్న వైసీపీ బలం
ప్రస్తుతం ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యుల్లో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం 2024 ఏప్రిల్ 22తో ముగుస్తుంది. ఇక, టీడీపీ నుంచి సభ్యులుగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతున్నారు. వారి పదవీ కాలం 2024 ఏప్రిల్ 22తో ముగుస్తుంది. ఇక, శాసనసభలో 151 స్థానాలు ఉన్న వైసీపీ ప్రస్తుత నాలుగు స్థానాలతో పాటుగా.. 2024లో ఖాళీ కానున్న మూడు స్థానాలను తన ఖాతాలోనే వేసుకోనుంది.
దీని ద్వారా ఏపీ నుంచి కోటాగా ఉన్న మొత్తం 11 మంది సభ్యులు వైసీపీ నుంచే ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజ్యసభలో ప్రస్తుతం నాలుగు స్థానాల్లో గెలవాలంటే ..సగటున ఒక్కో సీటుకు 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి ఉన్న ఎమ్మేల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు.

టీడీపీకి ఇప్పట్లో అవకాశం లేనట్లే
నాలుగు స్థానాలూ వైఎస్సార్‌సీపీ గెల్చుకుంటుంది. అదే విధంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు జరిగితే..ఆ మూడు స్థానాలు సైతం వైసీపీ ఖాతాలోనే జమ కానున్నాయి. ఇప్పుడు భర్తీ చేసే నాలుగు స్థానాల పైన వైసీపీలో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డికి తిరిగి రెన్యువల్ కావటం ఖాయంగా కనిపిస్తోంది.
అదే విధంగా.. బీసీ కోటాలో బీదా మస్తాన రావు.. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి..పారిశ్రామిక వేత్త ఆదానీ కుమారుడు పేర్లు ఖరారు చేయటం ఖాయమని తెలుస్తోంది. అయితే, రాజ్యసభకు సీఎం జగన్ ఇప్పటి వరకు బీసీ వర్గాలకు ప్రాధన్యత ఇస్తున్నారు. 2020లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా
వాటిలో రెండు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార)లను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు సైతం రెండు సీట్లు బీసీ వర్గాలకే కేటాయించనున్నట్లు తాజా సమీకరణాలతో అర్దం అవుతోంది. లోక్ సభలో 22 స్థానాలతో జాతీయ స్థాయిలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైసీపీ ఉంది.
ఇక, రాజ్యసభలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజ్యసభ స్థానాలు మూడు సైతం భర్తీ చేస్తే..పెద్దల సభలోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనుంది. ఇప్పుడు ఈ లెక్కలు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. ఇక, ఈ రోజు లేదా రేపు రాజ్యసభకు ఎంపిక కానున్న నలుగురు సభ్యులను పార్టీ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లోనూ ఈ సమీకరణ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications