ఏపీ వర్సెస్ తెలంగాణ: పంతం నెగ్గించుకునేందుకు పావులు
హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదీ జలాల పైన ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదం చెలరేగుతోంది. ఈ నెల 29వ తేదీన గోదావరి యాజమాన్య బోర్డు ముందుకు ఇరు రాష్ట్రాలు వెళ్లనున్నాయి.
పట్టిసీమ ప్రాజెక్టును ఏపీలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అలాగే, మహబూబ్ నగర్ ప్రాజెక్టుల పైన ఏపీ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలు బోర్డు ఎదుట తమ వాదనను వినిపించి నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం సరికాదని, ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నందున తమకు కృష్ణా జలాల్లో 45 టిఎంసీలు ఇవ్వాలని తెలంగాణ పట్టుబపడుతోంది.

దీనిపై ఏపీ.. పోలవరం పట్టిసీమలో అంతర్భాగమని, పోలవరం పూర్తయితే పట్టిసీమ నిలిచిపోతుందని, పోలవరంను మీరు ప్రశ్నిస్తే కంతానపల్లి ప్రాజెక్టు మాటేమిటని అడుగుతోంది. తెలంగాణలో కొత్తగా చేపట్టిన దీనిని నిలిపివేయాలని చెబుతోంది.
కృష్ణా నది పైన పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం తప్పుపడుతోంది. ఈ ప్రాజెక్టులు కొత్తవని ఏపీ చెబుతోంది. అయితే, అవి పాత ప్రాజెక్టులు అని తెలంగాణ చెబుతోంది. అయితే, డిండి ప్రాజెక్టుకు డిపిఆర్ ఆమోదం లేదని ఏపీ చెబుతోంది.












Click it and Unblock the Notifications