ఆ భవనాన్ని పూర్తిగా మాకు ఇచ్చేయండి: ఏపీని కోరిన తెలంగాణా; జగన్ ఏమంటారో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగి ఇంతకాలమైనా, రెండు రాష్ట్రాల మధ్య విభజన పంచాయతీలు మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. చాలా ఉమ్మడి ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ -తెలంగాణా భవన్ విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చ జరుగుతుంది.
ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ భవన్ ను మాకు ఇవ్వండి అంటూ ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని అశోక రోడ్డులో ఉన్న ఏపీ భవన్ రాష్ట్రాల విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఉమ్మడి భవనంగా కొనసాగుతుంది. ఏపీ - తెలంగాణ భవన్ తో పాటుగా, ఇతర ఉమ్మడి ఆస్తుల పై ఇరు రాష్ట్రాలతో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది.

హోంశాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ ఆధ్వర్యంలో అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు ఏపీ అధికారులను తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ భవన్ ను తమకు ఇవ్వాలని కోరారు. ఈ భవనంలో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలు ఉన్నాయని, కాబట్టి దానిని తమకు వదిలేయాలని ఏపీ అధికారుల ముందు తెలంగాణ అధికారులు ప్రతిపాదన పెట్టారు.
దానిని తమకు ఇచ్చేస్తే ప్రతిగా పటౌడీ హౌస్ లో ఉన్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని ఏపీకి ఇస్తామని, అందులో నూతన భవనాన్ని నిర్మించుకోవచ్చని సూచించారు. రెండు భవనాలు ఒకే చోట ఉండకూడదు అని కేసీఆర్ భావనగా వారు చెప్పారు. తెలంగాణ అధికారులు చేసిన ప్రతిపాదనపై కాస్త సానుకూలంగానే స్పందించిన ఏపీ అధికారులు ఇక ఈ విషయాన్ని తాము సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఆయనతో చెప్పి ఆపై ఆయన నిర్ణయాన్ని చెబుతామని పేర్కొన్నారు. దీంతో వచ్చే వారం ఈ వ్యవహారంపై మరోమారు సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకున్న తర్వాత తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావస్తుంటే ఇప్పుడు ఏపీ - తెలంగాణ భవన్ విభజన విషయం రెండు రాష్ట్రాల మధ్య చర్చకు వచ్చింది. మరి సీఎం జగన్ తెలంగాణా ప్రతిపాదనకు ఓకే అంటారా? లేదా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications