టీపై డిసెంబర్ 3న కాదు, 4నే కేబినెట్, తెలియదన్న డిగ్గీ
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై డిసెంబర్ 4వ తేదీననే కేంద్ర మంత్రి వర్గం చర్చిస్తుందని సమాచారం. తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రి వర్గం డిసెంబర్ 3వ తేదీననే సమావేశమవుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లు తొలుత వార్తలు వచ్చాయి. డిసెంబర్ 4వ తేదీన మంత్రి వర్గ సమావేశం ఉంటుందని గురువారంనాడు చెప్పారు. జీవోఎం నివేదికపై కేంద్ర మంత్రి వర్గం చర్చిస్తుందని ఆయన మీడియాతో చెప్పారు. డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జివోఎం సమావేశమంవుతుందని, 4వ తేదీననే జీవోఎం నివేదిక కేంద్ర మంత్రి వర్గం ముందుకు వస్తుందని వార్తలు వస్తున్నాయి.
కేంద్ర హోం శాఖ కార్యదర్శితో సుశీల్ కుమార్ షిండే శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో హైదరాబాద్‌పై ఉన్న ప్రత్యామ్నాయాలపై చర్చ జరుగుతుందని, హైదరాబాద్ స్థితిపై కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందని సుశీల్ కుమార్ షిండే చెప్పారు.

కాగా, జీవోఎం వ్యవహారాలపై తనకు ఏమీ తెలియదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. జైరాం రమేష్ దిగ్విజయ్ సింగ్‌ను కలిసి జివోఎం నివేదికను అందించారు. సాయంత్రం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చ జరిగే విషయం తనకు తెలియదని, తాను కోర్ కమిటీ సభ్యుడిని కాదని ఆయన మీడియాతో అన్నారు. రాష్ట్ర కాంగ్రెసులో ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
కాగా, సీమాంధ్ర నాయకులు చాలా మంది ఢిల్లీలోనే మకాం వేశారు. విభజనను ఆపడం సాధ్యం కాకపోతే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగానైనా చేయించాలనే ఉద్దేశంతో వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications