బాబు వెనక్కి తీసుకోవాలి: టి సిఎల్పీ, తెరాసతో ఢీయే
హైదరాబాద్: పోలవరం అథారిటీలో తెలంగాణకు సభ్యత్వం వద్దని, పోలవరం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వవద్దన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సిఎల్పీ ఖండించింది. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. బుధవారం తెలంగాణ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష సమవేశం ముగిసింది.
ఈ సమావేశంలో పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సిఎల్పీ తీర్మానం చేసింది. పోలవరం బోర్డులో తెలంగాణ వాళ్లు ఉండకూడదన్న నిర్ణయానికి వ్యతిరేకంగా, కాంగ్రెసు పార్టీ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని, తెరాస ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిఎల్పీ తీర్మానాలు చేసింది.

తెలంగాణ ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపలేదని, తెరాస పట్ల మెతక వైఖరి వద్దని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని వారు నిర్ణయించారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.
చీఫ్ విప్‌గా ఓదేలు
తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్‌గా నల్లాల ఓదేలు నియమితులయ్యారు. ప్రభుత్వ విప్‌గా బోధన్ ఎమ్మెల్యే షకీల్ నియమితులయ్యారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఉపసభాపతి పదవికి తెరాస ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు కోరారు. కానీ, తాము ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించామని, ఇప్పుడు మార్చే అవకాశం లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. దీనిపై భవిష్యత్తులో పరిశీలిస్తామని చెప్పారు. దాంతో, ఉపసభాపతి ఎన్నిక వ్యవహారం ముగిసింది.












Click it and Unblock the Notifications