కడప నుంచే మొదలుపెడతా..జగన్‌పై రేవంత్ రెడ్డి కామెంట్స్
విజయవాడ తాడేపల్లిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభాకర్, సురేఖ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
2029 ఎన్నికల్లో దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ.. ఏపీలో ముఖ్యమంత్రి షర్మిల ఎన్నికవుతారని జోస్యం చెప్పారాయన. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేది షర్మిలనేనని, ఆయన వారసురాలు ఆమె అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబసభ్యులకు వారసత్వం రావడం కాదని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించే వారే నిజమైన వారసులని పేర్కొన్నారు. 'వైఎస్ఆర్ పేరుతో వ్యాపారం చేసే వాళ్లు వారసుడు కాదు' అని జగన్ పేరేత్తకుండా విమర్శించారు.

ఇదే సమయంలో కడప ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అనుకోకుండా కడప ఉప ఎన్నికే వస్తే.. తాను అన్ని విధాలుగా షర్మిలకు తోడుగా ఉంటానని అన్నారు. ఆమె గెలుపు కోసం ఏమైనా చేస్తానని, అవసరం అయితే, కడపలోనే మకాం వేసి గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తానని అన్నారు. షర్మిల తిరుగులేని నాయకురాలిగా ఎదిగేందుకు కడప ఉప ఎన్నిక ఓ సువర్ణావకాశం లాంటిదని రేవంత్‌రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications