కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏపీలో డిప్యూటేషన్-రాహుల్ యాత్ర బాధ్యత
విజయవాడ : కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే తమిళనాడులో ప్రారంభమైన ఈ యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ అదే ఊపు కొనసాగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక నేతల్ని మోహరిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీల్లోనూ భారత్ జోడోయాత్ర సక్సెస్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.
రాహుల్ భారత్ జోడో యాత్ర త్వరలో ఏపీలో ప్రవేశించబోతోంది. రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగే ఈ యాత్రను సమన్వయం చేసే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం కూడా పంపారు. దీంతో ఆయన ఇవాళ విజయవాడకు వచ్చారు. అలాగే తెలంగాణలో యాత్ర బాధ్యతలు కూడా ఆయనే సమన్వయం చేయబోతున్నారు.

భారత్ జోడో యాత్రను సమన్వయం చేసే బాధ్యత తనకు అప్పగించారని... రెండు తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ యాత్రను తానే పర్యవేక్షిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీనిపై ఏపీ నాయకులతో చర్చించేందుకే విజయవాడ వచ్చినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభిస్తుందని ఉత్తమ్ వెల్లడించారు.
రాహుల్ చేపట్టిన ఈ యాత్రతో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా వెళుతుందన్నారు. అభివృద్ధి ఫలాలు దేశంలో అందరికీ అందాలని రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెట్టారని, ఏపీలో కూడా అందరూ కలిసి ఈ యాత్రను విజయవంతం చేసేలా కలిసి రావాలన్నారు. చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నా అందరూ సర్దుకుని పనిచేయాలని ఆయన నేతలకు సూచించారు. సమన్వయ లోపం ఉంటే వెంటనే తన దృష్టి కి తీసుకురావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ నేతలకు సూచించారు.












Click it and Unblock the Notifications