జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం..! తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..!
ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా పలువురు వ్యక్తులు, సంస్థలపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ ఈ కేసులు నమోదు చేసి దశాబ్దం పూర్తయిపోయినా ఇంకా ఎటూ తేలడం లేదు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు, సంస్థలు తమను వీటి నుంచి తప్పించాలని కోరుతూ వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నిందితులు దాఖలు చేసుకున్న ఓ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న నిందితుల జాబితాలో వాన్ పిక్ సంస్థ కూడా ఉంది. ఈ సంస్దకు ఏపీలోని ప్రకాశం జిల్లాలో భారీగా భూములు కేటాయించారు. ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో అప్పట్లో సీబీఐ కేసులు నమోదు చేసింది. దీనిపై హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలైంది. అయితే తమను ఈ కేసుల నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ వాన్ పిక్ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది.

హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇందులో సీబీఐ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకుని వాన్ పిక్ పిటిషన్ పై విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టు సీబీఐ అభిప్రాయం తీసుకుని ఇవాళ ఈ కేసుపై తీర్పు వెలువరించింది. ఇందులో వాన్ పిక్ ను ఈ కేసుల నుంచి విముక్తం చేసేందుకు నిరాకరించింది.

ఇప్పటికే జగన్ కేసుల్లో నిందితులు వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూ విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఓ దశలో సుప్రీంకోర్టు సైతం సీబీఐ, ఈడీతో పాటు కోర్టుల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజువారీ విచారణ సైతం జరపాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఓవైపు సీబీఐ కోర్టులో విచారణలు, మరోవైపు హైకోర్టులో పిటిషన్ల సంగతి తేల్చడం జరుగుతోంది.












Click it and Unblock the Notifications