IAS Srilakshmi : ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చిట్-తెలంగాణ హైకోర్టు ఆదేశాలు-ఓబుళాపురం అవినీతి కేసులో
ఏపీలో సీనియర్ ఐఏఎస్ గా ఉన్న శ్రీలక్ష్మికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబుళాపురం అక్రమాల కేసులో ఆమెపై సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసు నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఉమ్మడి ఏపీలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో 2007-2009 మధ్య గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ.80 లక్షలు తీసుకుని అనుమతులు ఇచ్చారని ఐఏఎస్ శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ 2012లో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. దీనిపై దర్యాప్తు సమయంలో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ లభించింది. అప్పటి నుంచి ఈ కేసు కొట్టేయాలని పోరాడుతున్న శ్రీలక్ష్మికి ఇన్నాళ్లకు ఊరట లభించింది.
ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కోసం లంచం ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసులో గాలితో పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్ వంటి అధికారుల పాత్రపైనా సీబీఐ గట్టి ఆధారాలు సంపాదించడంతో హైకోర్టు పలుమార్లు ఈ కేసు కొట్టేసేందుకు నిరాకరించింది. చివరకు ఇప్పుడు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇస్తూ తుదితీర్పు ప్రకటించింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టులో సీబీఐ పోరాడుతోంది.












Click it and Unblock the Notifications