టి 'సమైక్య' వ్యూహం: శ్రీధర్ బాబు కీ రోల్, తీర్మానాలు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత నేతలు వ్యూహరచన చేస్తున్నారు. మినిస్టర్స్ క్వార్టర్సులో తెలంగాణ తెలుగుదేశం, తెలంగాణ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ముసాయిదా బిల్లు, బిల్లు పైన చర్చ, శ్రీధర్ బాబు శాఖ మార్పు తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
విభేదాలు పక్కన పెట్టి అందరం ఏకమవుదామని, ఇందుకోసం ఓ కోఆర్డినేషన్ కమిటీని వేద్దామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతల వ్యవహార శైలిపై తాము అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి గీతా రెడ్డి చెప్పారు.

తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని కాబట్టి, తమ పార్టీని లక్ష్యంగా పెట్టుకొని విమర్శలు చేయడం సరికాదని, పరస్పర విమర్శలతో ఐక్యత కష్టమవుతుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. టిడిపి స్టాండ్ తెలంగాణకు అనుకూలమని చెప్పారు.
శ్రీధర్ బాబు శాఖ మార్పు బాధాకరమని, ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులోని అభ్యంతరాలపై అందరం ఒకే వాదన వినిపించుదామన్నారు. అభ్యంతరాలు చర్చకు రాకుంటే అందరం ఓ వినతి పత్రం ఇద్దామని, సభలో సమన్వయంతో వ్యవహరిద్దామని సూచించారు.
శ్రీధర్ బాబు కీ రోల్
శాసన సభా వ్యవహారాల నుండి తప్పించబడి, ఆ తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధర్ బాబు కీ రోల్ పోషించనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీల నాయకులను ఏకతాటి పైకి తీసుకు వచ్చే బాధ్యతను ఈ భేటీలో శ్రీధర్‌కు అప్పగించారు. దీంతో ఆయన పాత్ర కీలకంగా మారనుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను శాసన సభా వ్యవహారాల నుండి తప్పించడం, రాజీనామా చేసిన నేపథ్యంలో శ్రీధర్ బాబుకు సమన్వయ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
తీర్మానాలు
ఈ భేటీలో తెలంగాణ ప్రాంత నేతలు ప్రధానంగా రెండు తీర్మానాలు చేశారు. శాసన సభ వ్యవహారాల నుండి శ్రీధర్ బాబును తప్పించడాన్ని ఖండిస్తూ మొదటి తీర్మానం చేశారు. ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలవాలని రెండో తీర్మానం చేశారు. సిపిఎం, మజ్లిస్, సిపిఐ పార్టీలతోను చర్చించాలని నిర్ణయించారు.
కో ఆర్డినేషన్ కమిటీ
భేటీలో కో ఆర్డినేషన్ కమిటీని వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో కాంగ్రసెసు పార్టీ నుండి గండ్ర వెంకటరమణ, శ్రీధర్ బాబు, టిడిపి నుండి ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, తెరాస నుండి ఈటెల రాజెందర్, హరీష్ రావు, బిజెపి నుండి నాగం జనార్ధన్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణలు ఉన్నారు.
భేటీ అనంతరం జానా రెడ్డి మాట్లాడుతూ... కిరణ్ తీరును కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని, ఇక్కడి పరిస్థితిని తెలియజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా అన్ని పార్టీల నేతలం పని చేస్తామన్నారు. సభ తీరును రాష్ట్రపతికి వివరిస్తామని, సీమాంధ్ర నేతల వ్యుహాలకు తమ వద్ద ప్రతివ్యూహాలు ఉన్నాయన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని ఈటెల అన్నారు. బిల్లు పైన చర్చ జరగాలని ఇరు ప్రాంతాల నేతలు కోరుకుంటున్నారని చెప్పారు. సిద్ధాంతాలు, పార్టీలు వేరైనా కలిసి పని చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications