కృష్ణాపై సుప్రీంకు తెలంగాణ, ఏపీకి నోటీసులు, మీకేంటని రుణమాఫీపై హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ/హైదరాబాద్: కృష్ణా ట్రేబ్యునల్ కేటాయింపుల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేటాయింపు ప్రక్రియ మళ్లీ చేపట్టాలని తెలంగాణ తాజా పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరింది. అయితే, ఈ పిటిషన్ పైన విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా వేసింది.
విచారణ అర్హత పైన నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలకు నోటీసులు జారీ చేసింది. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదమని కర్నాటక, మహారాష్ట్రలు చెబుతున్నాయి. తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ట్రైబ్యునల్ ప్రక్రియ మళ్లీ చేపట్టాలని కోరింది.

బాబ్లీ మానిటరింగ్ కమిటీ పైన సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బాబ్లీ మానిటరింగ్ కమిటీలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసు విచారణను త్రిసభ్య ధర్మాసనానికి కోర్టు బదలీ చేసింది. కమిటీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొలగించాలని తన పిటిషన్‌లో తెలంగాణ రాష్ట్రం పేర్కొంది.
రుణమాఫీ: హైకోర్టు ఆగ్రహం
రైతు రుణమాఫీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రుణమాఫీని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీని పైన విచారణ చేపట్టిన కోర్టు.. రుణమాఫీకి బ్యాంకులు ముందుకు వస్తే మీకు అభ్యంతర ఏమిటని పిటిషనర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications