కేసీఆర్ కక్షగట్టారు: రేవంత్, దిష్టి బొమ్మ దహనం
హైదరాబాద్: అమరవీరుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదుకోలేదని తెలుగుదేశం తెలంగాణ ఎమ్మేల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వందరోజుల పాలన అధ్వాన్నంగా ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు కుటుంబాలకు ఎన్నికల సందర్భంగా 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు ఇచ్చిన కేసీఆర్ ... ఇప్పటి వరకు కనీసం ఆ పని మొదలుపెట్టలేదని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరుల కుటుంబాలను ఇప్పటివరకు కనీసం గుర్తించలేదన్నారు. అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేస్తే... వారి త్యాగాల గురించి ప్రజల్లో, మీడియాలో చర్చ జరుగుతోందని... దీని వల్ల తన కీర్తి ప్రతిష్టలకు దెబ్బ వాటిల్లుతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

సీమాంధ్రులు వేసిన ముళ్లకంచె ఓయూలో ఇంకా ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఓయూలో ఎందుకు పోలీసులను వైదొలగించలేదని నిలదీశారు. విద్యార్దులు, ఉద్యోగులు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డారని, ఎంతమంది విద్యార్దులకు ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఓయూలో విద్యార్థి జేఏసీ ఆందోళన
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులు మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించడం లేదని, మంత్రులెవరూ తమను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications