చంద్రబాబు నిర్ణయం వెనుక, బీజేపీ కొత్త గేమ్- వైసీపీ చేతికి అస్త్రం..!!
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పొత్తులపై చంద్రబాబు తేల్చేసారు. తెలంగాణలో ఒంటరి పోరాటమేనని స్పష్టం చేసారు. ఏపీలో మాత్రం పొత్తులు ఉంటాయని చెప్పారు. బలం కోల్పోయిన తెలంగాణలో ఒంటరిగా.. బలం ఉన్న ఏపీలో పొత్తులతో చంద్రబాబు వెళ్లటం వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.బీజేపీ గేమ్ లో భాగమా అనే చర్చ మొదలైంది. మరి..తెలంగాణలో బీజేపీ, టీడీపీ వేర్వేరుగా పోటీ చేస్తే పవన్ నిర్ణయం ఏంటి. ఏం చేయబోతున్నారు.
టీడీపీ ఒంటరి పోరు : తెలంగాణలో సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జనసేనతో పాటుగా బీజేపీతోకూ ఖాయమైతే టీడీపీ పొత్తు ఏపీకే పరిమితం కానుంది. తెలంగాణలో టీడీపీ, జనసేన తో పొత్తు కుదుర్చుకుంటే నష్టపోతామంటూ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు హైకమాండ్ వద్ద మొర పెట్టుకున్నారు. దీంతో, ఎవరికి వారు వేర్వేరుగానే పోటీకి దిగనున్నారు.

ఎన్డీఏలో పవన్ భాగస్వామిగా ఉన్నారు. కానీ, తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ సైతం ఇప్పుడు చంద్రబాబు తరహాలోనే ఒంటరి పోరుకు సిద్దం అవుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
పక్కా గేమ్ ప్లాన్ : ఇదంతా పక్కా గేమ్ ప్రకారమే జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. టీడీపీ, జనసేనతో పొత్తు కారణంగా బీజేపీకి తెలంగాణలో ప్రయోజనం కంటే నష్టం జరుగుతుందనే అంచనా ఉంది. ఇదే సమయంలో కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. హ్యాట్రిక్ దిశగా కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు, బీజేపీ, పవన్ వేర్వేరుగా పోటీ చేయటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంది.
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నా, కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదనేది వారి తొలి లక్ష్యంగా స్పష్టం అవుతోంది. దక్షిణాదిన కర్ణాటక తరువాత తెలంగాణలో కాంగ్రెస్ బలపడితే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కలిసొచ్చేనా..రివర్స్ అయ్యేనా : తెలంగాణ తరువాత ఏపీ ఎన్నికలు ఉండటంతో, అక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూడు పార్టీలు రెండు విధానాలు అమలు చేయటం కొత్త ప్లాన్ గా కనిపిస్తోంది. ఇది సక్సెస్ అవుతుందా..వికటిస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. తెలంగాణలో లేని పొత్తు ఏపీలో కేవలం జగన్ లక్ష్యంగా మాత్రమే ఉంటుందనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి.
అదే జరిగితే వైసీపీకి ఈ అంశం మరో ప్రచారాస్త్రంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. 2014 తరహాలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి పోటీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. బీజేపీ పొత్తుపై ఏం చేయబోతోందనేది అధికారికంగా స్పష్టత లేదు. దీంతో, తెలంగాణ ఎన్నికల తరువాతనే ఏపీలో పొత్తుల అంశంపైన స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications