AP Telugu Academy : 234 పోస్టులకు నోటిఫికేషన్-క్లారిటీ ఇచ్చిన తెలుగు అకాడమీ...
ఏపీలో తెలుగు అకాడమీ ఉద్యోగాల పేరుతో ఓ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఇందులో దాదాపు 200కు పైగా ఉద్యోగాలు రెండు కేటగిరీల్లో భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే దీనికి సంబంధించి చెల్లించాల్సిన ఫీజుతో పాటు ఇతర వివరాలను కూడా ఉంచారు. దీంతో పలువురు దీనికి అప్లై చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు విషయం బయటికి వచ్చింది.
ఏపీ తెలుగు అకాడమీ అకడమిక్ సర్వీసుల్లో 78 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో 156 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీని దరఖాస్తు ఫీజును రూ.500గా ఇచ్చారు. దీంతో పలువురు ఈ నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు కూడా చేసుకుంటున్నారు. ఈ విషయం ఆ నోట, ఈ నోట తెలుగు అకాడమీ దృష్టికి వచ్చింది. దీంతో అకాడమీ అధికారులు దీనిపై ఆరా తీశారు. ఇలాంటి నోటిఫికేషన్ ఎక్కడా విడుదల చేయలేదని నిర్ధారించుకున్నారు.

ఈ మేరకు ఇవాళ తెలుగు అకాడమీ అధికారులు ఈ ఫేక్ నోటిఫికేషన్ పై స్పందించారు. తెలుగు అకాడమీలో ఉద్యోగాల భర్తీ అంటూ చెలామణీ అవుతున్న నోటిఫికేషన్ నకిలీది అంటూ అధికారులు ప్రకటించారు. ఇలాంటి ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాము ఇప్పటివరకూ ఎలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదని వారు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పటికే ఫీజు చెల్లించిన వారు లబోదిబోమంటున్నారు.
ఈ ఫేక్ నోటిఫికేషన్ పై తెలుగు అకాడమీ అధికారులు విజయవాడ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి సర్కులేట్ అవుతుందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితుల్ని కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications