ఎపిలో వెలుగు అధికారిని తరిమికొట్టిన తెలుగు తమ్ముళ్లు...జన్మభూమి బహిష్కరణ...కలకలం...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విజయనగరం: ఎపి ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తున్న ఐదో విడత జన్మభూమి కార్యక్రమం అధికారులకు చుక్కలు చూపిస్తోంది. పలుచోట్ల అభివృద్ది పనుల విషయమై ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. అయితే తాజాగా విజయనగరం జిల్లాలో ఓ అధికారిని టిడిపి నేతలు వెంటబడి తరిమికొట్టడం కలకలం రేపింది. మరోచోట రుణాలు ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి జన్మభూమి సభలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు.

విజయనగరం జిల్లా గజపతినగరంలో జరిగిన జన్మభూమి గ్రామసభలో వెలుగు అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ శ్రీనివాసరావుపై అధికారపార్టీ టిడిపి నాయకులు దాడి చేశారు. తమ శాఖ అభివృద్ది కార్యక్రమాల గురించి ఎపిఎం శ్రీనివాసరావు వివరిస్తుండగా మరి నిధుల గోల్ మాల్ విషయాల మాటేమిటని స్థానిక సర్పంచ్‌, ఆ తర్వాత ఎంపిటిసి సభ్యులు ప్రశ్నించారు. అధికారి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే అతని సమాధానం నచ్చని టిడిపి నాయకులు, మహిళా సర్పంచ్, ఎంపీటీసీలు ఆయనపై మూకుమ్మడి దాడికి దిగారు. వారికి భయపడి పరుగులు తీస్తున్న అధికారిని వెంటబడి మరీ కొట్టడం సంచలనం సృష్టించింది.

జన్మభూమి...గ్రామసభ...

జన్మభూమి...గ్రామసభ...

గజపతినగరంలో మంగళవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో వెలుగు అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ శ్రీనివాసరావు, సర్పంచ్‌ ఎన్‌.ఆదిలక్ష్మి, ఆమె భర్త శంకరరావు, ఎంపిటిసి సభ్యులు కె.శ్రీదేవి, ఆమె భర్త నానాజీ, మరో ఎంపిటిసి సభ్యులు ఎన్‌.ప్రసన్న లక్ష్మి, ఆమె భర్త చందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలుగు అధికారి శ్రీనివాసరావు తమ శాఖ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి సభలో వివరిస్తున్నారు. అయితే అధికారిని మధ్యలోనే అడ్డుకున్న స్థానిక టిడిపి నేతలు మీ పరిధిలో జరిగిన పసుపు, కుంకుమ నిధుల గోల్‌మాల్‌, సాధికారమిత్ర, కల్యాణమిత్ర నియామకాలు వాటి గురించి చెప్పాలని సర్పంచ్‌, ఆ తర్వాత ఎంపిటిసి సభ్యులు ప్రశ్నించారు. స్త్రీనిధి రుణాలు రూ.ఐదు లక్షలను అప్పటి క్లస్టర్‌ కో-ఆర్డినేటర్‌ రత్నం స్వాహా చేసిందని, వాటిని ఇంతవరకు ఎందుకు రికవరీ చేయలేదని ఎపిఎం శ్రీనివాసరావును నిలదీశారు.

అధికారి వివరణ...నేతల దాడి...

అధికారి వివరణ...నేతల దాడి...

అయితే ఈ రుణాల స్వాహా స్కామ్ తన హయాంలో జరగలేదని, అయినప్పటికి దీనిపై విచారణ పూర్తయ్యిందని, సిసి నుంచి నిధులు రికవరీ చేయాల్సి ఉందని, త్వరలోనే చేస్తామని ఆయన సమాధాన మిచ్చారు. సాధికారమిత్ర, కల్యాణమిత్ర నియామకాలను తాను నిబంధనల ప్రకారమే చేశానని, ఇందులో రాజకీయజోక్యం ఉండాల్సిన అవసరం లేదని చెప్పేందుకు వెలుగు అధికారి శ్రీనివాసరావు ప్రయత్నించారు. దీంతో మండిపడిన టిడిపి నేతలు, నువ్వు ఎప్పుడూ మాపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు...అసలు ప్రజాప్రతినిధులంటే నీకు గౌరవం లేదు...అంటూ ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. అలాగే అక్కడున్న మరికొంత మహిళలు, ప్రజాప్రతినిధులు కూడా వెలుగు అధికారిపై చేయి చేసుకున్నారు. అనూహ్యంగా అందరూ దాడికి దిగడంతో భయపడిన వెలుగు అధికారి భయంతో ప్రాణరక్షణ కోసం పరుగులు తీశారు.

ఆపినా ఆగలేదు...పోలీసులకు ఫిర్యాదు...

ఆపినా ఆగలేదు...పోలీసులకు ఫిర్యాదు...

వెలుగు ప్రాజెక్ట్ మేనేజర్ పై టిడిపి నేతలు దాడికి దిగడంతో మిగిలిన అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నేతల మూకుమ్మడి దాడిలో చొక్కా చిరిగి, గాయపడ్డ శ్రీనివాసరావును సహచర ఉద్యోగులు స్థానిక కమ్యూ నిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత ఈ దాడి గురించి మిగతా అధికారులు తహశీల్దార్‌ బి.శేషగిరిరావుతో కలిసి ఎస్‌ఐ పి.వర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

జన్మభూమి బహిష్కరణ...రాజీ ప్రయత్నాలు

జన్మభూమి బహిష్కరణ...రాజీ ప్రయత్నాలు

అధికారి శ్రీనివాసరావుపై దాడికి నిరసనగా బుధవారం నుంచి జన్మభూమి బహిష్కరించాలని నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులు నిర్ణయించారు. మరోపక్క దాడి ఘటన సంచలనం సృష్టించడం, ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయడం, అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఎమ్మెల్యే కెఎ.నాయుడు రాజీ కోసం రంగంలోకి దిగి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

 జన్మభూమి సభలో...ఆత్మహత్యాయత్నం...

జన్మభూమి సభలో...ఆత్మహత్యాయత్నం...

మరోవైపు కృష్ణాజిల్లా ముసునూరు మండలం గోపవరంలో అధికారుల సాక్షిగా జన్మభూమి గ్రామ సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సభ ప్రారంభమైన కొంతసేపటికే రొంప మునియ్య అనే వ్యక్తి వేదిక దగ్గరకు వచ్చి ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నారని టిడిపి నాయకులను, అధికారులను ప్రశ్నించారు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న ఎండోసల్ఫాన్‌ పురుగు మందును వారిముందే తాగేసి ఇంటికి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మునియ్యను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The series of incidents involving some of the ‘adventurous’ leaders of the Telugu Desam Party is turning into a major inconvenience for the ruling TDP. The ruling party leaders on Tuesday attacked on velugu project officer after heated discussion at the janmabhoomi programme in Vizayanagaram district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X