బొత్స ఇలాకాలో తెలుగుదేశం "మాస్టర్ ప్లాన్"!!
ఉత్తరాంధ్ర రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తన హవా కొనసాగిస్తున్న సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను లక్ష్యంగా ఎంచుకున్న తెలుగుదేశం పార్టీ అందుకు తగ్గ వ్యూహాలు రూపొందిస్తోంది. విజయనగరం జిల్లాతోపాటు చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స కుటుంబ సభ్యలు ఆధిపత్యానికి గండి కొట్టాలనే పట్టుదలతో టీడీపీ ఉంది.

6 సార్లు టీడీపీ, మూడు సార్లు బొత్స
చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఇక్కడి నుంచి గెలిచిన బొత్స నియోజకవర్గం మొత్తం తానే అయి వ్యవహరించేవారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు, వైసీపీ తరఫున ఒకసారి విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొత్తం 9 సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు టీడీపీ, మూడుసార్లు బొత్స గెలుపొందారు.

ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపితే..?
బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టడం ద్వారా విజయనగరం జిల్లాలో తన ప్రాభవాన్ని పునరుద్ధించుకోవడానికి టీడీపీ వ్యూహాలు రూపొందిస్తోంది. గత ఎన్నికల్లో బొత్సకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునను బరిలోకి దింపింది. అయితే ఆయనకు దీటుగా నాగార్జున వ్యవహరించలేకపోతున్నారని భావిస్తున్న టీడీపీ అధిష్టానం ఈసారి బలమైన ఎస్సీ నేతలను దింపాలనే యోచనలో ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి రెండు సామాజికవర్గాలకు చెందినవారే పోటీచేస్తున్నారని, అలాకాకుండా ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపి బొత్సను ఓడించాలనే పట్టుదలతో ఆ పార్టీ వ్యూహాలు పన్నుతోంది.

ప్రతిభా భారతి లేదంటే కొండ్రు?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న కిమిడి నాగార్జున కు మరోచోట నుంచి అవకాశం కల్పించి ఆ స్థానంలో వేరే బలమైన అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనే యోచనగా ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, లేదంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన కొండ్రు మురళీమోహన్ ను కానీ బరిలోకి దింపాలనే సమాలోచనలు జరుగుతున్నాయి. 1955లో జరిగిన ఎన్నికల్లో ప్రతిభా భారతి తండ్రి, మాజీ న్యాయమూర్తి పున్నయ్య కృషికార్ పార్టీ తరఫున చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications