BRS Vs TDP: నిను వీడని నీడను నేనే!!
తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో విజయవంతంగా నిర్వహించిన బహిరంగ సభ గురించి భారతీయ జనతాపార్టీ ఏమనుకుంటోంది? ఆ పార్టీ వైఖరి ఎలా ఉండబోతోంది? రాజకీయ త్రాసులో మొగ్గేదెంత? తగ్గేదెంత? అంటూ రాజకీయ వర్గాల్లో లెక్కలు ప్రారంభమయ్యాయి. ఏపీలో వైసీపీకానీ, తెలంగాణలో బీఆర్ఎస్ కానీ భారతీయ జనతాపార్టీతో పొత్తు కోసమే చంద్రబాబునాయుడు సభ నిర్వహించారంటూ విమర్శలు ఎక్కుపెట్టాయి.

చంద్రబాబు అప్పుడే చెప్పారుగా..
సభలో బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ అధికారికంగా స్పందించారు. ఎవరి దయా దాక్షిణ్యాలమీద ఆధారపడే పార్టీ కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు ఉండటంతోపాటు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పునాది ఉంది.. వాసన ఉంది.. అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం అంటే నిషేధించిన పార్టీ కాదని, గతంలోనే చంద్రబాబునాయుడు టీడీపీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఖమ్మం సభపై అనవసర రాద్ధాంతం ఎందుకని, ఎవరైనా, ఎక్కడైనా సభ నిర్వహించుకోవచ్చన్నారు.

బీఆర్ఎస్ కు పోటీగా విస్తరణ?
తెలుగుదేశం పార్టీ మరోసారి తెలంగాణలో బలంగా విస్తరించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగితే అందరికన్నా ముందుగా భారత రాష్ట్ర సమితి పార్టీ నష్టపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన బీఆర్ఎస్ నేతలు వెంటనే తెలుగుదేశం పార్టీపై దాడికి దిగారంటున్నారు. మరోవైపు భారత రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో ఈటెల రాజేందర్ వ్యాఖ్యల ప్రకారం బీఆర్ఎస్ కు పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా ఆయా రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

కేసీఆర్ అడుగులో చంద్రబాబు అడుగు?
ఖమ్మం సభను రాజేందర్ సమర్ధించడంతోపాటు భవిష్యత్తులో టీడీపీ వేయబోయే అడుగులను కూడా చూచాయగా చెప్పారు. భారత రాష్ట్ర సమితిద్వారా కేసీఆర్ ఎక్కడికైతే వెళతారో అక్కడకు తెలుగుదేశం పార్టీ కూడా వెళ్లనుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. అయితే ఏపీ, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారి కోసం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ పోటీచేయకుండా జాతీయ పార్టీగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ కు పోటీగా వెళ్లడంద్వారా తెలుగుదేశం కూడా జాతీయ పార్టీకి కావల్సిన నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓటింగ్ ను దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications