
విశాఖ ఎయిర్ పోర్టులో పట్టించుకోని చంద్రబాబు... ఆలోచనలో పడ్డ గంటా శ్రీనివాసరావు!!
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది చాలా తక్కువ. పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు కానీ అది పెండింగ్‌లో ఉంది.

ప్రభుత్వంతో ఇబ్బంది ఎందుకులే అనుకున్న గంటా
జగన్ హయాంలో దాదాపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరిపై కేసులు నమోదయ్యాయి. గంటాపై మాత్రం ఒక్క కేసు నమోదు కాలేదు. ఆయన జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. వైసీపీ ప్రభుత్వంతో అనవసరంగా ఇబ్బందులు ఎందుకులే అనుకున్న గంటా రాజకీయాల్లో మందకొడిగా కనిపించారు. విపక్షంలో మూడు సంవత్సరాలుగా మౌనం పాటిస్తూ వస్తున్నారు. ఎక్కడా ఒక్క కామెంట్ చేయలేదు. తన నియోజకవర్గంలో పర్యటించాల్సిన అవసరం కూడా గంటాకు లేదు. ఆయన నమ్మకస్తులు, అనుచరులే అక్కడే పనులన్నింటినీ చక్కబెడుతుంటారు.

మహానాడుకు దూరం జరిగిన గంటా
ఒంగోలులో జరిగిన మహానాడుకు గంటా శ్రీనివాసరావు దూరంగా ఉన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో పార్టీపరంగా జరిగిన ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు. టీడీఎల్పీ సమావేశాలకు అంతే. తాజాగా జిల్లాలవారీగా చంద్రబాబు మినీ మహానాడులు జరుపుతున్నారు. చోడవరం మినీమహానాడులో పాల్గొనేందుకు విశాకపట్నం ఎయిర్‌పోర్టుకు వెళ్లిన చంద్రబాబుకు గంటా స్వాగతం చెప్పే ప్రయత్నం చేశారుకానీ బాబు పట్టించుకోలేదు. ఒక చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు. దీంతో గంటా ఆలోచనలో పడ్డారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

అయ్యన్నపాత్రుడికే ప్రాధాన్యత
గతంలో ఉన్న ప్రాధాన్యత లేకపోవడం, ఎయిర్ పోర్టువద్ద పట్టించుకోకపోవడంలాంటివన్నీ గంటాను ఆలోచనలో పడేశాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన నేతలకే ప్రాధాన్యత అని చంద్రబాబు మొదటినుంచి చెబుతున్నారు. ఈ మూడు సంవత్సరాల్లో పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అయ్యన్నపాత్రుడే అంతా తానై వ్యవహరించారు. ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేసింది. ఆయన ఇంటి గోడ కూల్చివేసిన వ్యవహారమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది.

గంటాను పట్టించుకోవాల్సిన అవసరంలేదు?
విశాఖపట్నం తెలుగుదేశంపార్టీలో అయ్యన్నపాత్రుడు సీనియర్ నేత. ఆయనపై అనేక కేసులు ఇప్పటికే నమోదైవున్నాయి. భవిష్యత్తులో ఆయనకు ప్రాధాన్యత ఉండబోతోందని అర్థమవుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దూరంగా ఉన్న గంటా శ్రీనివాసరావును పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాబు నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ గంటాను ఆలోచనలో పడేశాయి. జనసేన పార్టీలో చేరతారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆయన చేరలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ముందుగా చంద్రబాబు ఇంటికి వెళ్లిన గంటాను బాబు సాదరంగానే ఆహ్వానించారు. అక్కడినుంచి కలిసే ఇద్దరూ అసెంబ్లీకి వచ్చారు. మున్ముందు తన ప్రాధాన్యతను పెంచుకోవడానికే గంటా శ్రీనివాసరావు ప్రయత్నిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.