ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ: కీలక నిర్ణయాలివే, రేవంత్ షాకింగ్
విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. శనివారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో పది కీలక అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల సీఎంలు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్లు తెలిసింది.
అంతకుముందు ప్రజాభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు. .. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రజాభవన్‌లోకి చేరుకున్న చంద్రబాబును శాలువతో సత్కరించిన రేవంత్‌రెడ్డి.. కాళోజీ నారాయణరావు రాసిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.

రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీలో చర్చ కొనసాగింది. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూశ్ కుమార్‌తో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లు శాంతికుమారి, నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో పాటు ఇతర శాఖల అధికారులు పలువురు హాజరయ్యారు. కాగా, తెలంగాణలోని భవనాలను ఏపీకి ఇచ్చేందుకు సీఎం రేవంత్ నిరాకరించినట్లు సమాచారం. అయితే, భవన నిర్మాణానికి కావాల్సిన స్థలం ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
సీఎంల భేటీలో చర్చించిన అంశాలివే
ఉద్యోగుల విభజన అంశాలు
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు
హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించే అంశం
విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు
ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు
విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు
పెండింగ్ విద్యుత్ బిల్లులు
లేబర్ సెస్ పంపకాలు.












Click it and Unblock the Notifications