భయం - భయంగా : ఉక్రెయిన్ లో 1500 తెలుగు విద్యార్ధులు : సాయం కోసం నిరీక్షణ..!!
ఉక్రెయిన్ పైన రష్యా యుద్దంతో ఇప్పుడు అక్కడ తెలుగు విద్యార్ధులు భయం భయంగా గడుపుతున్నారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను..విద్యార్జులను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఉక్రెయిన్ ఏయిర్ స్పేస్ పైన నిషేధం విధించటంతో అక్కడ చిక్కుకున్న వారిని తెచ్చేందుకు వెళ్లిన విమానం వెనక్కు వచ్చేసింది. దీంతో..ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు.. కీలక సూచనలు చేస్తున్నారు. ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి స్వదేశాలకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
Recommended Video

దాదాపు 1500 మంది నిరీక్షణ
ఇక, ఉక్రెయిన్‌లోని వైద్య కళాశాలల్లో సుమారు 1500 మంది తెలుగువారు చదువుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా వందల మంది మెడిసిన్ చదవడానికి వెళ్తున్నారు. వారిలో అత్యధికులు ఉక్రెయిన్ అధికారులు చెప్పిన మాటలు విని భారత ప్రభుత్వం విమానాలు ఏర్పాటు చేసినా వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోయారు. భారత్ వచ్చేయాలని కొందరు భావించినా విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా నిర్ణయించడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. వెనక్కి వచ్చేయాలని భావించిన కొందరికి విమాన టికెట్లు మార్చికి గానీ దొరకలేదు. ఒక్కసారిగా గురువారం నుంచి యుద్ధం ప్రారంభం కావడం, విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వారందరూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

భయం భయంగా పరిస్థితులు
తాజా పరిస్థితులతో తెలుగు విద్యార్ధులు అక్కడ ప్రతీ క్షణం భయం భయంగా గడుపుతున్నారు. ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్దులు వీరిలో ఉన్నారు. వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబ సభ్యులతో వార్ టచ్ లో ఉన్నారు. బాంబు దాడులతో ఇంటర్నెట్ సమస్యలు ఏర్పడుతున్నాయి. స్థానికంగా అండగా నిలవాల్సిన ఉక్రెయిన్ అధికారులు తమను నిలువునా ముంచేశారని పలువురు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వస్తుందన్నది అవాస్తవ ప్రచారమని అధికారులు నమ్మబలికారు. దీంతో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు వారి వారి పౌరుల్ని వెనక్కి వచ్చేయాలని విమానాలు ఏర్పాటు చేసినా చాలామంది పట్టించుకోలేదు. కనీసం సరకులు కూడా నిల్వ చేసుకోలేదు.

చేతులెత్తేసిన స్థానిక అధికారులు
కొంత మంది విద్యార్ధులకు స్థానికంగా వస్తున్న సూచనలు పాటిస్తున్నారు. సైరెన్ మోగిన సమయంలో బంకర్లలో తల దాచుకుంటున్నట్లుగా తమ తల్లి తండ్రులకు చెప్పి వాపోతున్నారు. ఉక్రెయిన్ లోని ఖార్‌కీవ్ నగరంలో కొన్నిచోట్ల బాంబ్‌షెల్టర్లు ఏర్పాటు చేసారు. నగరానికి దూరంగా బాంబు దాడులు జరుగుతున్నాయి. భారతీయ విద్యార్ధులు అక్కడి అధికారుల సూచనల మేరకు పాస్‌పోర్ట్, గుర్తింపుకార్డులు తదితర పత్రాలన్నీ పట్టుకుని సాయం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రికి లేఖ రాసారు.

కేంద్రంతో తెలుగు రాష్ట్రాల సంప్రదింపులు
ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఇద్దరు సీనియర్ అధికారులను నియమించారు. ఏపీ అధికారులు నేరుగా విద్యార్ధులతో మాట్లాడుతున్నారు. ఇక, తెలంగాణ ఎంపి రంజిత్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖా మంత్రికి లేఖ రాసారు. తెలుగు విద్యార్జులను రప్పించే ప్రయత్నం చేయాలని కోరారు. కేంద్ర విదేశాంగ శాఖ.. ఉక్రెయిన్ లోని రాయబార కార్యాలయ అధికారులతో సమీక్ష చేస్తోంది. పొరుగున ఉన్న హంగేరీ నుంచి విద్యార్ధులు..భారతీయలును స్వదేశానికి రప్పించేందుకు ఆ దేశాల సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications