బాబు దీక్ష భగ్నంకు రంగం: ఎపిభవన్ ఉద్రిక్తం, రోడ్లు బ్లాక్
న్యూఢిల్లీ: తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని ఎఫి భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎపి భవన్‌ను పోలీసులు ముట్టడించారు. క్రమంగా పోలీసులు భవనంలోకి వచ్చారు.
ఈ పరిస్థితుల్లో అక్కడే భారీగా గుమికూడిన వేలాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులకు, కాంగ్రెసు పార్టీకి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాబు దీక్షను భగ్నం చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. భవన్‌లోకి ప్రవేశించిన పోలీసులు టిడిపి నేతలతో మాట్లాడుతున్నారు.

బాబుచే దీక్ష విరమింప చేయాలని పోలీసులు కోరగా అందుకు నేతలు నిరాకరిస్తున్నారు. భవన్ ఎదుట బాబును తరలించేందుకు అంబులెన్సును సిద్ధం చేశారు. బాబును తరలిస్తారని భావిస్తున్న ఆర్ఎంఎల్ ఆసుపత్రి వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. బాబు వద్దకు పోలీసులు రాకుండా ఉండేందుకు కార్యకర్తలు అధినేతకు రక్షణగా నిలబడ్డారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
ఐదు రోజులుగా బాబు దీక్ష చేస్తుండటంతో ఆరోగ్యం క్షీణిస్తోందని కాబట్టి ఆయన దీక్షను విరమింప చేయాలని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications