కార్తీక వనభోజనాల్లో ఉద్రిక్తత
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొన్నలూరులో జరుగుతున్న కార్తిక వనభోజననాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సంగమేశ్వర దేవస్థానం వద్ద కొండెపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ సమావేశం నిర్వహించుకునేందుకు సభావేదికను కూడా సిద్ధం చేశారు. వేదికపై ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే సీఐ పాతంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దేవస్థానం వద్ద సభ జరగడానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండెపి వైసీపీ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్ ఆదేశాలతోనే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. సంగమేశ్వర ఆలయం వద్దకు ర్యాలీగా వస్తున్న కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇతర నాయకులను చెన్నుపాలెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కి తగ్గని నాయకులు పోలీసుల అడ్డంకుల మధ్యే సంగమేశ్వరం ఆలయం వద్దకు చేరుకున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఈ జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తుండగా మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే యోచనతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇటువంటి తరుణంలోనే ప్రతి చిన్న విషయం రాజకీయమై ఉద్రిక్త పరిస్థితులను రాజేస్తోంది.












Click it and Unblock the Notifications