సీమాంధ్ర బంద్: అనంతపురంలో ఉద్రిక్తత
అనంతపురం: తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో సీమాంధ్రలో రెండో రోజు కూడా బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసు బలగాలు విద్యార్థులను అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకులు ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. కాగా సీమాంధ్రలోని మిగితా జిల్లాల్లో కూడా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు మూతపడ్డాయి.

కృష్ణా జిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, నాగుల్ మీరా, బుద్దా వెంకన్నలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ పట్నంలో టిడిపి శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎంపి చింతామోహన్ ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఇంటిని ముట్టడించేందుకు సమైక్యవాదులు, టిడిపి నేతలు యత్నించారు. ఈ సందర్భంగా టిడిపి నేత రామ్మోహన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కడప, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు చోట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు బంద్‌లో పాల్గొని ర్యాలీలు, నిరసన ప్రదర్శలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications