కొట్టుకున్న కూటమి, వైసీపీ కార్పొరేటర్లు.. విశాఖలో టెన్షన్!
విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతం యూనివర్సిటీ కి చెందిన వివాదాస్పద భూముల అంశం పైన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కూటమి కార్పొరేటర్లు, వైయస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి చివరికి అది బాహాబాహీ కి దారి తీసింది.
జీవీఎంసీకౌన్సిల్ సమావేశం లో కూటమి వర్సెస్ వైసీపీ
నేడు విశాఖపట్నంలో జీవీఎంసీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూముల పైన వైసిపి నిరసన చేపట్టింది. మేయర్ పోడియం ఎదుట వైసిపి కార్పొరేటర్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు వైసిపి తో పాటు, వామపక్షాలు యత్నం చేస్తున్నాయని కూటమి కార్పొరేటర్లు ఆరోపించారు.

కౌన్సిల్ హాల్ లో ఉద్రిక్తత
ఈ సందర్భంగా కూటమి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత అది తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. కౌన్సిల్ హాల్ లో మాత్రమే కాకుండా జీవీఎంసీ ప్రాంగణం బయట కూడా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వామపక్ష పార్టీలు మెయిన్ గేట్ ను ముట్టడించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.
తోపులాటలో పలువురికి గాయాలు
ఈ ఘర్షణలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ లక్ష్మణరావు కాలికి గాయమైంది. ఇక నిరసనలు శృతిమించడంతో మేయర్ సభను వీడి తన చాంబర్ కు వెళ్ళిపోయారు. ఈ సమావేశంలో కూటమి తరపున ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ హాజరయ్యారు. ఇక వైసీపీ తరఫున విశాఖలో భూ దోపిడి పైన మాట్లాడిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు ఆయన కుటుంబం విశాఖలో భూ ఆక్రమణలను చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
అర్దాంతరంగా ఆగిపోయిన కౌన్సిల్ సమావేశం
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యల కోసం జరగాల్సిన చర్చ ఉండగా, దానిని పక్కనపెట్టి విశాఖ గీతం యూనివర్సిటీ భూముల పైన రగడ కొనసాగిన క్రమంలో కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications