నివురుగప్పిన నిప్పులా జమ్మలమడుగు.. కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్; కౌంటింగ్ టెన్షన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు నుంచి నేటివరకు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున నిఘా పెట్టినా, భారీగా కేసులు నమోదు చేస్తున్నా పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఇదిలా ఉంటే కడప జిల్లా జమ్మలమడుగులో కూడా ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో జమ్మలమడుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటిదగ్గర పోలీసులు భద్రత పెంచారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి భారీ భద్రత
నిన్న రాత్రి హైదరాబాద్ నుండి ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేరుకున్నారు .ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు గన్మెన్ ల సౌకర్యం కూడా కల్పించి ఆయన భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 20 మంది పోలీసులతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి భద్రత ఏర్పాటు చేశారు.

అభ్యర్థుల ఇళ్ళ వద్ద ఇంకా కొనసాగుతున్న పికెటింగ్
ఇక బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, టిడిపి ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డి అక్కడ లేనప్పటికీ వారి ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ ఇంకా కొనసాగుతుంది. జమ్మలమడుగులో మే 13 పోలింగ్ రోజున అల్లర్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసేందుకు కూడా తగిన చర్యలు చేపట్టిన పోలీసులు మొత్తం ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన 46 మందిపై కేసులు నమోదు చేశారు.
ఎమ్మెల్యే అభ్యర్థులు పరస్పర దాడులు.. కేసులు
పోలింగ్ రోజున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై దాడి ఘటన కేసులో బిజెపి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి పైన టిడిపి ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డి పైన వారి అనుచరుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కారుపై దాడి చేసిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన ఆయన అనుచరుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
జమ్మలమడుగులో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి
జమ్మలమడుగులో ఇప్పటికీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండడంతో టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల దగ్గర పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక జమ్మలమడుగు ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ ముగిసిన తర్వాత జమ్మలమడుగులో అదనపు పోలీసు బలగాలు మొహరించాయి. ప్రస్తుతం కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా చూడడం సవాలుగా తీసుకున్న పోలీసులు అందుకు తగిన చర్యలు చేపట్టారు.
కౌంటింగ్ పై ప్రధానంగా ఫోకస్ చేస్తున్న పోలీసులు
ఇక ఎన్నికలలో ఘర్షణలకు పాల్పడిన వారి పైన కౌంటింగ్ సందర్భంగా ప్రత్యేకమైన దృష్టిని సారించారు. ఇప్పటివరకు ఘర్షణలకు పాల్పడిన వారిని 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, తమ చర్యల ద్వారా కౌంటింగ్ విషయంలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications