పవన్ రాజమండ్రి వస్తున్నారు - ఆటంకాలు అడ్డుకోలేవు : సీఎంకు రూల్స్ వర్తించవా- మనోహర్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ రాజమండ్రి పర్యటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని..పవన్ కళ్యాణ్ కాసేపట్లో రాజమండ్రికి బయల్దేరుతున్నా రంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రోడ్ల పరిస్థితి పైన ఉద్యమం నిర్వహించిన జనసేన గాంధీ జయంతి నాడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు బాగు చేసేందుకు శ్రమ దానం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా... పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం, అనంతపురం జిల్లా కొత్త చెరువుల్లో అక్టోబరు 2న శ్రమదానం చేయాలని నిర్ణయించారు.

పవన్ రాజమండ్రి వస్తున్నారంటూ
ధవళేశ్వరం వద్ద శ్రమదానానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ధవళేశ్వరం బ్యారేజీ రోడ్డు ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని, దీనిపై శ్రమదానం చేయడానికి అనుమతి ఇచ్చేది లేదని తిరస్కరించింది. దీంతో జనసేన తన కార్యక్రమాన్ని రాజమండ్రి సమీప హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని, శ్రమదానం నిర్వహిస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం అనంతపురం జిల్లా కొత్త చెరువు చేరుకుని శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

ముందస్తుగా జనసేన నేతల హౌస్ అరెస్ట్
రాజమహేంద్రవరం సమీప బాలాజీపేటలో బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా మరోచోట సభ జరుపుకోవాలని చెప్పారు. అయితే సభ అక్కడే జరుపుతామని జనసేన నాయకులు చెప్పడంతో.. నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్‌లు చేస్తూ.. లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. రాజమండ్రిలోకి వచ్చే అన్ని మార్గాల్లోనూ పోలీసులు మొహరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని జనసేన నేతలము ముందుగానే నోటీసులు జారీ చేసారు. దీంతో..అసలు పవన్ శ్రమదానం కోసమైనా రాజమండ్రిలోకి వస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతన్న సమయంలో పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేసారు.

ప్రభుత్వం పైన జనసేన విమర్శలు
శాంతియుతంగా చేపట్టే శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా శ్రమదాన కార్యక్రమం ద్వారా రహదారులకు మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయిస్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఇది అప్రజాస్వామిక చర్యని.. ఇది ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల రోడ్లు దెబ్బ తింటే జనసేన మరమ్మతులు చేస్తోందని వివరించారు.

డీజీపీకి ముందుగానే సమాచారం ఇచ్చాం
శ్రమదానం చేస్తామని ఎవరూ చెప్పలేదు.. అనుమతులు లేవు అని పోలీసు అధికారులతో పాలకపక్షం అబద్దాలు చెప్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సెప్టెంబర్ 27వ తేదీన రాష్ట్ర డీజీపీకి ఈ కార్యక్రమం గురించి తెలియచేశామన్నారు. అదే విధంగా రాజమండ్రి అర్బన్ ఎస్పీ, అనంతపురం ఎస్పీకి కూడా తెలియచేశామని వివరించారు. శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనవద్దు అంటూ జనసేన నాయకులను, కార్య కర్తలను గృహనిర్బంధాలు చేస్తూ అడ్డుకొంటున్నారని చెప్పుకొచ్చారు.

ఆటంకాలు కల్పించినా..నిర్వహించి తీరుతాం
ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. కొద్దిసేపట్లోనే శ్రీ పవన్ కల్యాణ్ రాజమండ్రికి బయలుదేరుతున్నారని స్పష్టం చేసారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, జనం గుమికూడ రాదు అంటూ రూల్స్ చెబుతున్నారని.. మరి ఇవే రూల్స్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ రోజు విజయవాడ బెంజి సర్కిల్ లో నిర్వహించే కార్యక్రమానికి ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నించారు. విజయవాడను దిగ్బంధించి మరీ వేలమందితో చెత్త వాహనాల కార్యక్రమం చేస్తే కోవిడ్ రాదా అని నిలదీసారు.
Recommended Video

జాతిపిత స్పూర్తితోనే ముందుకు
అప్పుడు జనం గుమిగూడరా అంటూ మనోహర్ ప్రశ్నిస్తున్నారు. ఇక, శ్రమదానంతో బాపూజీకి నివాళి అర్పించినున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అన్యాయం, హింస, దురాక్రమణ వంటి కల్మషాలపై.. పోరాడే తత్వాన్ని గాంధీజీ భారత జాతికి అందించారన్నారు. జాతిపిత స్ఫూర్తితోనే రోడ్లకు శ్రమదానం ద్వారా.. మరమ్మతులు చేయాలని సంకల్పించామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications