ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వద్ద విద్యార్ధుల ధర్నా...మెడికల్ కౌన్సిలింగ్ రద్దుకు డిమాండ్
విజయవాడ:ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రిజర్వేషన్లు లేకుండా ఇప్పటి వరకు జరిగిన మెడికల్ కౌన్సిలింగ్‌ను రద్దు చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే మెడికల్ సీట్ల భర్తీలోనూ అనేక అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు.

విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులు-పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దీంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
అయితే ఇదే విషయమై శనివారం జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుప్రీం కోర్టులోనైనా రిజర్వేషన్ విద్యార్థులకు న్యాయం జరిగేలా గట్టి పోరాటం చేయాలని అధికారులకు సూచించి 48 గంటలు కూడా గడవక ముందే విద్యార్థులు ఆందోళనకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మెడికల్ కాలేజీల ఎంపికలో రిజర్వేషన్ అభ్యర్థులకు స్వేచ్ఛ చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేందుకు సిద్ధమైన క్రమంలో దీనిపై గ్రీవెన్స్ హాల్లో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
2001 లో ఇచ్చిన జీ.వో. 550 ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులు మెరిట్ పై ఓపెన్ క్యాటగిరిలో మెడికల్ కాలేజీ సీటు లభిస్తే అతని ఇష్టానుసారం ఓపెన్ లేదా రిజర్వేషన్ కేటగిరిల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వీలుంది. ఆ అవకాశాన్ని నిలిపివేస్తూ ఆగస్టు 7 న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రిజర్వేషన్ అభ్యర్థికి మెరిట్ లో సీటువస్తే అతన్ని ఓపెన్ క్యాటగిరీ అభ్యర్థిగా మాత్రమే భావించాలని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఈ అంశాలను సంబంధిత అధికారులతో సిఎం చంద్రబాబు చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
మరోవైపు ఈ నెల 30 లోపు మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాల్సి వుండగా లేని పక్షంలో ఆ మేరకు సీట్లు మిగిలిపోయే పరిస్థితి వుంటుంది. దీంతో రిజర్వేషన్ కేటగిరీల విద్యార్థులు నష్టపోనున్నారనేది విద్యార్థి సంఘం నేతల ఆందోళనగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications