నీట్ రీటెస్ట్ కౌంట్ డౌన్: ఎగ్జామ్ సెంటర్లకు కేంద్ర పరిశీలకులు: అజ్ఞాతంలో క్వశ్చన్ పేపర్ సెట్టర్లు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ తేదీ దగ్గరపడుతోంది. ఇంకో మూడు రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ నెల 21వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరుగనుంది. దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మునుపెన్నడూ లేనంత అత్యంత కఠినమైన భద్రతా చర్యలను అమలు చేస్తోంది. ఈ ప్రవేశ పరీక్షను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఈ ఏర్పాట్లు, సన్నద్ధతపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఉదయం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, అనుబంధ సంస్థల డైరెక్టర్లు సహా మొత్తం 222 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యాశాఖ, ఎన్టీఏ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల విద్యారంగ ప్రతినిధులు హాజరయ్యారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా నిష్పాక్షికమైన విధానాలు, అత్యున్నత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. రీ-ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక పరిశీలకులను రాష్ట్రాలకు పంపనున్నట్లు వెల్లడించారు. వీరందరూ కూడా ఎన్‌టీఏ కమాండ్ సెంటర్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
పరీక్ష రాయబోయే అభ్యర్థులకు ఎటువంటి మానసిక ఆందోళన లేదా ఇతర ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కోరింది. గతంలో నిర్వహించిన ప్రధాన ప్రవేశ పరీక్షలలో పత్రాల లీకేజీలు, పరీక్షా సరళిలో జరిగిన కొన్ని ప్రధాన పొరపాట్లపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో రీ-ఎగ్జామినేషన్ పట్ల అభ్యర్థులలో కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకోవడం ప్రభుత్వానికి సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మక సవాలుగా మారింది.
దీనికోసం సోషల్ మీడియా నియంత్రణ, వైమానిక దళ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడంచెల రక్షణ విధానాలను అనుసరిస్తోంది. రీ-ఎగ్జామ్‌కు ముందు సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ ప్రశ్నాపత్రాల సమాచారం బదిలీ కాకుండా, లీక్ గ్రూపుల ద్వారా సాగే మోసాలను నివారించడానికి ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సేవలను కేంద్రం పరిమితం చేసింది.
ప్రశ్నాపత్రాల రవాణా కోసం వైమానిక దళాన్ని వినియోగిస్తోంది. క్వశ్చన్ పేపర్లు ఉన్న సీలు చేసిన పెట్టెలను ఎక్కడా ఎలాంటి లీకేజీ ప్రమాదం లేకుండా దేశవ్యాప్తంగా తరలించేందుకు సైనిక రవాణా విమానాలు, ఎంఐ-17 రకం హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకుని రానుంది. దేశంలో దాదాపు 18 ప్రధాన ప్రాంతీయ హబ్‌లకు నేరుగా పేపర్లను తీసుకువెళతాయి. అక్కడి నుండి కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా చేరవేస్తారు.
మరోవైపు ప్రశ్నాపత్రాల పంపిణీకి ముందే వాటి రహస్యాలు బయటకు రాకుండా పేపర్ తయారీ విభాగంపై ఎన్‌టీఏ కఠినమైన నిబంధనలను విధించింది. ఈ పరీక్షా ప్రక్రియలో పాల్గొంటున్న క్వశ్చన్ పేపర్ సెట్టర్లు, నిపుణులు, మోడరేటర్లు వాడుతున్న వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు.
పరీక్షా ప్రక్రియ పూర్తయ్యే జూన్ 21 వరకు ఎలాంటి ఇంటర్నెట్ సదుపాయం లేని ఒక రహస్య సురక్షిత గదిలో వీరిని పూర్తి పర్యవేక్షణలో ఉంచారు. విద్యార్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఈ ప్రత్యేక కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు.













Click it and Unblock the Notifications