సజ్జలకు జగన్ గుడ్ న్యూస్: ఆ ముగ్గురికీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నలుగురు సలహాదారుల పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంలో వారందరూ కేబినెట్ హోదాలో కొనసాగుతోన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- వారి సేవలు అవసరమని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
సజ్జల రామకృష్ణా రెడ్డి, అజేయ కల్లం, జీవీడీ కృష్ణమోహన్, శామ్యుల్.. పదవీ కాలాన్ని పొడిగించింది ఏపీ ప్రభుత్వం. మరో ఏడాది కాలం పాటు వారు అదే పదవిలో కొనసాగుతారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజా భద్రత సలహాదారుగా పని చేస్తోన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోన్నారు. రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలరనే పేరుంది సజ్జలకు.

ప్రజా భద్రత సలహాదారుగా- జీఓ నంబర్ 1ను తీసుకుని రావడంలో కీలక పాత్ర పోషించారు. కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించిన నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీ అది. రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. వైఎస్ఆర్సీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు దీనిపై న్యాయస్థానంలో పోరాడిన విషయం తెలిసిందే.
జీవీడీ కృష్ణమోహన్ ప్రభుత్వ కమ్యూనికేషన్ల సలహాదారుగా వ్యవహరిస్తోన్నారు. సీనియర్ పాత్రికేయుడు. వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉంది. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచీ వైఎస్ జగన్ వెంటే ఉంటోన్నారు. పాదయాత్ర సమయంలోనూ ఆయనతో కలిసి తిరిగారు. పార్టీ విధానాలను బలంగా జనంలోకి తీసుకెళ్లగలరనే పేరుందాయనకు.
ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉంటోన్నారు అజేయ కల్లం. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలో పని చేసిన అనుభవం ఉందాయనకు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన పదవీ విరమణ చేసిన తరువాత వైఎస్ జగన్.. ప్రధాన సలహాదారుగా అపాయింట్ చేశారు. జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా సేవలను అందిస్తోన్నారాయన. మరో సలహాదారు శామ్యుల్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications