అక్కడ మాట్లాడి ఉంటే పవన్ కళ్యాణ్ కాళ్లు, చేతులు విరిచేవారు: టీజీ
అమరావతి: తిరుపతిలో సభ పెట్టి ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా పవన్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే ఇంట్లో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిలా నిద్రపోయారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు లేచి ప్రత్యేకహోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలనడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. టీడీపీ, బీజేపీ ఎంపీలపై పవన్ చేసిన వ్యాఖ్యలు చౌకబారు తనానికి నిదర్శమని అన్నారు. రాజకీయం చేయడమంటే నెలనెలా జీతం తీసుకున్నట్లు కాదని ఆయన మండిపడ్డారు. పవన్ ఏపీలో మాట్లాడాడు కాబట్టి సరిపోయిందని అన్నారు.
ఇదే వ్యాఖ్యలు తమిళనాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించి లోపల వేయించేవారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదాను తెరపైకి తెచ్చిందే తానని అన్నారు. హోదా కోసం ఏమైనా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. టీడీపీ ఎంపీలు ఏ పని చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఏపీకి హోదా కోసం ఏం చేయాలో పవనే చెప్పాలని, వేదికపై మాట్లాడటం సరికాదని, హోదా కోసం ముందు ఏం చేయాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి హోదా కోసం మేమంతా పోరాడతుంటే ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ఏం చేశారని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు.
చివరగా చిరంజీవి ప్రజారాజ్యానికి పట్టిన గతే జనసేనకు పడుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్‌పై టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇప్పటి వరకు టీడీపీకి చెందిన నేతలెవరూ టీజీ మాదిరి విమర్శలు చేయక పోవడం విశేషం.
హోదా కోసం ఉద్యమిస్తాం: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
సోమవారం ఉదయం శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలు పెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఈ సందర్భంగా కేఈ ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications